పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

166

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


లోకులమాటల్లా వుండగా యింట్లో పెళ్లాంబిడ్డలే చెవి వొగ్గరు. వారు మనకు-స్వరాజ్యం యిచ్చి యేలుకోండని దూరంగా కూర్చున్నా - వారినాగరికత మనమీద అనుగ్రహించి దూరంగా తొలగితేనే తప్ప మనం బాగుపడం, వారికి నామకః మతమంటూ వున్నప్పటికీ క్షణంలో వారు దాన్ని త్యజిస్తారు. ఆచారవ్యవహారాలలో ఉత్తరధ్రువానికీ దక్షిణ ధ్రువానికీ వున్నంతదూరంగా పైకి కనపడినా మనతోపాటు మతవిశ్వాసం కలవాళ్లు మహమ్మదీయులే. నిన్న మొన్నటిదాకా రష్యాలో దేవుడు లేడు; నేడు మళ్లా వున్నాడని వినవస్తూవుంది. యెల్లుండి మళ్లాఉండడు. ఆవలెల్లుండి వుంటాడు. "మదధీనా తవస్థితిః" అని ఎవరో ఆచార్యపురుషులు దేవుణ్ణిగురించి - అన్నారంటారుగాని అది యూరపుఖండంలో చాలా కాలంనాడే అమలుజరగడానికి ఆరంభించింది. కొన్నాళ్లు ముస్సోలినీ దేవుడు, అంతకంటేకూడా పెద్దదేవుడు. హిట్లరు. గుఱ్ఱపు జట్కావాడు బాగా నడిచే తన గుఱ్ఱాన్ని హిట్లరు పదంతోటి వాడేవాడు. మీసాన్ని గుఱించి చెప్పేదేమిటి? హిట్లరు అంతరించినా ఆ మీసాలు కనబడుతూ వున్నంతకాలం అతడు వున్నట్టే. నాజీజం నశించినా ఆ మీసం నశించదు. యే కాలంలోనూ నేటి భారతీయులవంటి ప్రజలు వున్నట్లు గ్రంథ దృష్టాంతం కనపడదు. ఆడవాళ్ల నాగరికత యెన్ని వెఱ్ఱితలలువేసిందో వేసింది. యిప్పటికి సుమారు యిరవైయేళ్ల నాడు "యజ్ఞోపవీతం బుజ మెక్కు జందెం" దగ్గిఱికివచ్చి రవికె గౌరవం నిల్చింది. యిది యేదేశాన్నుంచి రవాణా అయిందోగాని పాశ్చాత్య నాగరికతబాపతుకాదు. వారిది చలిదేశం. వొంటినిండా బట్టలేనిదే బతకలేరు. కఱవును గూర్చి వ్రాస్తూ మాఱుపుంతలోపడ్డాం.

ధాన్యం పుష్కలంగా మనకు పండినా అన్ని ఖండాలూ పండితే తప్ప మనకు కఱువు తగ్గదు. వర్షాభావంచేత ధాన్యం వగయిరాలు పండ లేదుకనక వాటివెల హెచ్చిందను కుందాం. తోళ్లవెల యెందుకు హెచ్చాలి? సినీమా టికట్టువెల యెందుకు హెచ్చాలి. నల్లమందువెల యెందుకు హెచ్చాలి? భోగంమేళాల వెలదగ్గిరనుంచీ హెచ్చడానికి ధాన్యంవెల హెచ్చడమేనా కారణం? యేమో దీనిలో కొంత "వేలాంవెఱ్ఱి" వుండితీరుతుంది. మంగలి బుఱ్ఱగొఱగడానికి చార్టీ హెచ్చించడంవంటిదేనా సినీమా టిక్కెట్టుకు వెల పెంచడం, వాడికి ఆ డబ్బులలో బియ్యం కొనుకుంటేనే కాని పొయికిందకీ పొయిమీదకీ పదార్థం దొరకదు. సినీమావారికి యెక్కువ ధనం వుండడమేకదా యీ వ్యాపారం ఆరంభించడానికి కారణం. వారిని యీ ధాన్యపుకఱువేం బాధిస్తుంది? యీ కఱవురోజుల్లో బియ్యానికి పెట్టిన రేషనింగు సినీమాలకుకూడా పెడితే కొంత బీదలపిల్లలకు కూడు అర్ధాకలిగానేనా - దొరకేదేమో?