పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

162

ఆచారభేదాలు

పూర్వకాలంలో కఱవులు వచ్చాయంటే వాట్లకు కారణం వర్షాలు కురవకపోవడం అనుకొని వారుణ జపాలు చేయించడమూ, సహస్రఘటాభిషేకాలు చేయించడమూ యీరీతిగా రాజులు ఆ రోజుల్లో దైవాన్ని నమ్మి దేవతారాధనలు చేసి ఆ వుపద్రవాన్ని తొలగించుకునేవారు - విరాటపర్వం యేకదీక్షగా ఉదయంస్నానం చేసుకుని పారాయణ చేయడంకూడా వర్షాన్ని కురిపించేది.

నా విద్యార్థిదశలో కిర్లంపూడిలో మాగురువుగారూ మేమూ ఆసంస్థాన వార్షికానికి వెళ్లినప్పడు ఆ సమీపగ్రామం గెద్దనాపల్లి కాపురస్థులు ఆయీ పారాయణనిమిత్తం మీ శిష్యులలో యెవరినేనా వొకరిని పంపవలసిందని కోరితే విద్యార్థులలో అల్లులలో మల్లుగావున్న నన్ను పంపించారు గురువుగారు. చెఱువువొడ్డున కూర్చుని పారాయణ చేసేటప్పటికి యెక్కువగా కాదుగాని వొక అఱదుక్కి చినుకులు వెంటనే (తిడితే గుద్దినట్టు) పడ్డాయి. యదనంతరన్యాయంచేత ఆ వర్షం నా పారాయణకు ఫలితంగా ఆ వూరి గృహస్థులు భావించి నన్ను సత్కరించారు.

నేను యేడెనిమిదేళ్ల వయస్సులో వుండగా వొక కఱువువచ్చింది. దాన్నే ధాత యీశ్వర కఱువుగా ఇప్పుడు మనవాళ్లు చెప్పుకుంటారు. రు.1 టికి పదిమానికలు అంటే పది సేర్లుబియ్యం ఇచ్చేవారు. ఆ కాలానికదే పెద్ద కఱువు. కాలం బాగుంటే రు.1కి అయిదూ ఆఱూ కుంచాలుబియ్యం యిచ్చే ధర్మకాలంగదా అది? పంటవిస్తరించి పండేటట్టయితే యెక్కడి ధాన్యం అక్కడే ముక్కిపోయే రోజులు అవి. సుమారు పుట్టెడు నువ్వులు మాతాలూకు కొనేవాళ్లు లేక నుసికావడం నా చిన్నతనంలో నేనే యెఱుగుదును. బందరులో స్కూలుపండితుడుగా వుండేరోజులలో వేసంగి సెలవులకు గుడివాడమీదుగా నూజివీడు రైలు స్టేషనుకు (అప్పటికింకా బందరురైలు తయారు కాలేదు) ప్రయాణంచేస్తూ చోరభయంచేత యేవూరుదగ్గఱ పొద్దుగుంకితే ఆ వూళ్లోనే మకాం చేయవలసివచ్చేది. కానుమోలు వగయిరా వూళ్లుకొన్ని ఆ రోడ్డున తగిలేవి. అక్కడ వంటచేసుకోవలసివచ్చేది. మజ్జిగ కొనుకోవడానికి సంసారుల వీధికి వెడితే అమ్మకానికి దొరికేదేకాదు. కావలిస్తే