పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

156

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


బోధపడతాయి. హాస్యాన్ని నికృష్టంగా చూస్తారు. గాని, నీతిని బోధించడానికి నవరసాలలో దాన్ని పోలిన రసం లేనేలేదంటాను నన్నడిగితే. వీరికి మాధ్వనామం మతగురువునుబట్టి వచ్చినదని తెల్విడి.

యికవైష్ణవులనుగూర్చి తప్ప తక్కిన మన దేశపు బ్రాహ్మణశాఖలని గూర్చి వ్రాసినట్లయింది. వీరిలో అవాంతరభేదాలు చాలావున్నాయి. అవన్నీ వివరించవలసివస్తే చాలా గ్రంథం పెరుగుతుంది. ముఖ్యంగా రెండు భేదాలు అందఱికీ తెలిసినవున్నాయి. (1) తెళహ, (2) వళహ - అని రెండు తెగలుగా విభజిస్తేచాలు. మతవిషయంలో అనగా ముక్తివిషయంలో కూడా యీ రెండు తెగలవారికీ భేదం సరేసరి, బొట్టులోకూడా యత్కించి ద్భేదం వుంది, ఆయీ భేదం చాలా ఆయువుపట్టు. వళహలు పాదం లేని బొట్టు ధరిస్తారు. తెళహలు పాదంతో ధరిస్తారు. పాదం అంటే కనుబొమ్మలమధ్యను దాటి ముక్కుమీదికి రావడం. కాంచిలో ఆయీ రెండు తెగలవారూ కూడా వున్నారు. వరదరాజ స్వామినికూడా ఆయీ భేదానికి గుఱిచేస్తూ వుంటారని వినడం. అంతేకాదు యీ నామం కోర్టులదాకా వెళ్లించడం కూడా చేస్తుందిట. వీరిలో వీరికి దక్షిణాదిని యిచ్చిపుచ్చుకోవడం వుంది. కాని అల్లుడిబొట్టు అల్లుడిదే మామగారి బొట్టు మామగారిదే నేడు కమ్యూనిష్టులూ, కాంగ్రెసువారూ యేలాగో, వీరూ వారూ ఆలాగే గమ్యస్థానం వొకటే అయినా సికపట్లకు లోనవుతూ వుంటారు. వళహవారు వేదానికి స్మార్తులిచ్చినంత గౌరవాన్నీ యిస్తారు. అనగా యజ్ఞయాగాదులు పిష్టపశువుతో కాకుండా ప్రత్యక్షపశువుతోటే చేస్తారు. గత భర్తృకలైన స్త్రీలకు, శిరోముండనం ఉంది. తెళహవారికి యీ రెండూ లేవు. యజ్ఞమంటూ యెవరూచేసినట్లు లేదు. కేవల భక్తికే ప్రాధాన్యం యిస్తారు. మతకర్తయూ, భాష్యకర్తయూ అయిన శ్రీరామానుజులవారు తెళహలే అని వీరు చెపుతారు. వారు వళహవారే అని వారంటారు. రామానుజులతరువాత మళ్లా రామానుజులంతో అంతకెక్కువో అని వారే కాక యితరమతస్థులుకూడా విశ్వసించదగిన వేదాంతదేశికులు వళహలే. మహాకవీ యాగకర్తా అయిన వేంకటాధ్వరి వళహే. తెళహలు ద్రావిడ వేదానికిచ్చినంత గౌరవం ఋగ్యజురాది వేదాల కివ్వరు. వళహలు యించుమించు ఋగ్యజురాదులవిషయంలో స్మార్తులే కాని ద్రావిడవేదాన్ని కూడా గౌరవిస్తారు. ద్వైతులకు కన్నడం రాకపోవడం గౌరవభంజకమైనట్లే వీరికి అఱవం రాకపోవడంకూడా డిటో, వీథిలో దేశభాష మాట్లాడినా యింట్లో లేదా వంటయింట్లోనేనా అఱవం మాట్లాడేవారు చాలా ప్రశస్తమైనవారుగా అంగీకరింపబడతారు. దీనిక్కారణం భగవత్కాలక్షేపానికి వుపయోగపడే తాత్త్వికగ్రంథం (ఉపనిషత్సారం) యావత్తూ ఆళ్వారులు అఱవంలో అనువదించడమే. యెన్నివేదాలువచ్చినా నాలుగు పాశురాలేనా రాకపోతే ఆ వ్యక్తికి, గౌరవం లేదన్నమాటే. వేదం వచ్చినవారు