పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

148

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


జగ్గకవిగారి చంద్రరేఖావిలాపంలో చంద్రరేఖకి తండ్రిగా అపలపింపబడ్డవారు. జగ్గకవి వేంకట సోమయాజులు గారిముందు గడ్డిపోచగాకూడా మాఱదు. ఆయన వేదవేదాంగ పారంగతుడు. పైగా సంస్కృతంలో మహాకవి. జగ్గకవి తెలుగు కవిత్వానికి కావలసినంత సంస్కృత పాండిత్యం వున్నవాడు. వీరిద్దరున్నూ యేటికొప్పాక జమీందార్లవద్ద తారస పడడంలో యేదో వైరకారణం కలిగివుండాలి. “యాచకో యాచకశ్శత్రుః" జమీందార్ల వద్ద జగ్గకవికి తా ననుకున్న లాభం లభించకపోవడంమాత్రం సత్యం. దానికి సోమయాజులుగారు కారకులో కారోగాని, జగ్గకవిగారికి సోమయాజులుగారే కారకులనే నిశ్చయం కలిగినట్లు విలాపంవల్ల గోచరిస్తుంది. ఆ కాలంలో సంస్కృతపండితులు, యద్వా కవులు, తెలుగు కవులను తోటకూరలోని పరుగులమాదిరిని చూడడం మాత్రం అప్పుడేకాదు యిప్పుడుకూడా సంస్కృతపండితులకూ కవులకూ తెలుగుకవులంటే చాలా యీసడింపే! యిట్టి యీసడింపు సోమయాజులుగారు, జగ్గకవిగారిపట్ల కనపఱిచే వుంటారు. విలాపంలో కొన్ని వాక్యాలు యీ మర్మాన్ని వ్యాకరిస్తాయి.

(1) "పెద్దయేనుగుకాలంత... ... ఇట్టి సౌందర్యనిధి భువి బుట్ట జేసినట్టి తామరచూలి నేర్పఱయదరమె? చాల జదివిన వేంకటశాస్త్రికైన"

(2) "డాయను భీతిఁ బొంద మగడా?యను సొమ్ములుదాల్చు. డా? యను. ... వేంకటశాస్త్రి నేఁడు రాఁ డా? యను వానికేమి పుఱుడా? యను నేగతి దేవుఁడా యనున్”

ఆయీ వేంకటశాస్త్రిగారే వేంకటసోమయాజులుగారు. యీయన చేసిన యజ్ఞశాలలోనే రాజుగారు చంద్రరేఖతో మొదటి కన్నెర్కం జరిగించినట్లున్నూ, ఆ చంద్రరేఖ సోమయాజులుగారి సంతానమైనట్టున్నూ జగ్గకవిగారు కోపంకొద్దీ ఔచిత్యానౌచిత్యాలు పాటించక వ్రాస్తే వ్రాశారుగాక ఆ వ్రాతవల్ల సోమయాజులుగారికి లాభించింది. యెందుచేతనంటే, రాజుగారికి చంద్రరేఖ అనే వుంపుడుకత్తె వుంటే వుండుగాక, ఆమె వేంకటశాస్త్రిగారికి కూతురే అగుగాక, రాజుగారికి మిద్దెలూ, మేడలూ యెన్నో వుంటాయి గదా! అట్టిస్థితిలో యీ యజ్ఞశాలలోనేనా ప్రథమసమాగమభాగ్యం కావలసివచ్చింది? అనే విప్రతిపత్తి గోచరించి ఆయీ గాథయావత్తూ కాకపోయినా, సోమయాజులుగారి చుట్టరికం చంద్రరేఖ తల్లికి వుందనే టంతవరకేనా అసత్యమని తేలుతుంది.

చంద్రరేఖా విలాపంలో వున్న విషయం యావత్తూ కల్పితమేకాని రాజుగారికి చంద్రరేఖ వుంపుడుకత్తె అనే టంతవఱకు యథార్థం కాకపోదు. జగ్గకవి అఖండ శివపూజా ధురంధరుడైన తిమ్మకవిగారికి సాక్షాత్తూ సోదరుడు. అట్టి సద్వంశీయుడు యీ అనుచితానికి