పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


జంకి పన్నుచెల్లిస్తాయన్నమాట. ఘూర్జరులు విశేషించి వర్తకులేమో? వీరిలో పాండిత్యము వల్ల పేరందిన వారి పేళ్లు శ్రుతంకావడంలేదు. వేంకటాధ్వరి– “కేవా ఘూర్జరసుభ్రువా మవయవాయూనాం న మోహావహాః" (విశ్వగుణాదర్శం) అనడంచేత ఆయీ బ్రాహ్మణులు ఐశ్వర్యవంతులని సాక్షాత్పరంపరయా బోధిస్తుంది. "యత్రాకృతిస్తత్రగుణాః, యత్ర గుణాస్తత్ర సంపదః" అయితే వేంకటాధ్వరి యావత్తుజాతినీ బోధించే ఘూర్ణరపదాన్ని ప్రయోగించడంచేత దాన్ని కేవలం బ్రాహ్మణ పరం చేయడం సమంజసంకాదనే శంక కవకాశంవున్నా బ్రాహ్మలతోపాటు యితరులు కూడా ఐశ్వర్యవంతులు కావలసివస్తుంది. కాని అంతకంటే వచ్చే విప్రతిపత్తిలేదని తెల్విడి. అయినా మనకు బాగా తెలియని విషయంలో యేదో వ్రాతకుదిగి, తెలిసీ తెలియని వ్యాఖ్యాతలవలె అపహాస్యాస్పదులం కావడంకంటే యేకొంచమేనా తెలిసిన విషయంలోనే కొంత వ్యాకరించడం సమంజసం కనక ప్రస్తుతం అట్టిది- "ఆంధ్రభ్రాహ్మణ జాతి" కనక దాన్ని గూర్చే తెలిసినంతలో కొంతవ్యాకరిస్తాను. యీ పేరు వీరువసించే దేశం ఆంధ్రదేశం కావడంచేత వచ్చివుంటుంది. యిదేకాదు తక్కిన ద్రవిడ, కర్ణాట, వగైరా పేర్లుకూడా డిటో, యీ పేరుగల బ్రాహ్మణులలో అవాంతరభేదాలు చాలావున్నాయి. (1) తెలంగాణ్యులు (2) వేగినాట్లు (3) వెల్నాట్లు (4) కాసలనాట్లు (5) ములికి (ముల్కు నానాటికి మురికిగా పరిణమించింది) నాట్లు, (6) కరణకమ్మలు వీరు వైదికులమని వ్యవహరించుకుంటారు. అన్యోన్యమూ వీరిలో వీరికి పంక్తిభోజనాలు (ఆహితాగ్నులకుతప్ప) కలవు. మంచప్పొత్తు (వివాహాలు) మాత్రం యేలేశ్వరోపాధ్యాయుల నాటినుండి లేదు. అంతకుపూర్వం వున్నట్లే వూహించాలి. ఉపాధ్యాయులుగారి కొమార్తెకు విశ్వబ్రాహ్మణుడు భర్తగా (ప్రమాదంచేత) తటస్థపడ్డాడనిన్నీ ఆ కారణంచేత శ్రుతిస్మృతి సందర్భంలేని యీ వివాహనిషేధం బ్రాహ్మలలో ఆచారంగా పరిణమించినదనిన్నీ చెప్పుకుంటారు. “ఏలేశ్వరోపాధ్యాయులు" గారు చాలా గొప్పవారని తోస్తుంది. ఆయన వెల్నాటిశాఖీయులే. ఆ యింటిపేరివారు ఆశాఖలో మొగల్తుర్తి గ్రామంలో నేడున్నూ వున్నారు. ఇతరత్రకూడా వుండివుంటారు. నాకు అక్షరాభ్యాసానంతరం (రెండో గురువులు) యేలేశ్వరరావు శ్రీరామశాస్త్రుల్లుగారే. ఆయీ వంశీకులు వుపాధ్యాయులుగారి కొమార్తెకు ప్రమాదవశతః ఘటించిన “విశ్వబ్రాహ్మణ జామాతృకత్వం" కారణంగా ఆయీ శాఖవారికి వెలి (బహిష్కారం) వచ్చి తద్ద్వారా వీరువెలినాట్లుగా ఏర్పడి తుదకు వెల్నాట్లుగా వ్యవహరింపబడుతూ వున్నారని వొక పుక్కిటి పురాణము శ్రుత మవుతుందిగాని అది యుక్తి సహము కాకపోవడముచేత అనాదరణీయము. యెవరో వృథా శాఖాభిమానులు "దురభిమాన గ్రహావేశ ధూమధూపితులు" కల్పించి వుంటారు. పాకనాడు, కాసలనాడు, వేగినాడువగైరా పేళ్లవంటిదే యీవెలనాడున్నూ వెలనాడు అనేది విదర్భదేశానికి