పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/132

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

136

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


క. "కోపము చీకటికూపము
     కోపము పాపముల కాదిగురువగు హింసా
     ధూపము కోపముగావునఁ
     గోపింపంగూడ దేరికొఱకయిన సఖా!”

అంటూ నారాయణముని నరమునిని మందలించినట్లు దేవీభాగవతంలో కనపడుతుంది. కోపం వచ్చినప్పుడు మన మేపనిచేసినా ఆ పని అద్ధ్వాన్నంగా పరిణమిస్తుంది. అందులో విద్యావిషయకమైన వాదోపవాదాలు మొదలు పెడతామనుకోండి. యెంతచండాలంగా వుండాలో అంతచండాలంగా నున్నూ వుండవలసి వస్తుంది. వాట్ల సవరణకొఱకు మనం యెన్ని అనుచితాలకో సిద్ధపడవలసివస్తుంది. కాని ఆ అనుచితాలేవిన్నీ కార్యకారులుకావు. "భక్షితే౽పి లశునే నరోగశాంతిః" అన్నట్లు పరిణమిస్తాయి. కోపం వక్క యుద్ధరంగంలో పనికి వస్తుంది కాని యితరత్రా యుద్ధవీరునికి కూడా అది పనికిరాదు. తీరా యెదటివానితో చేయీ చేయీ కలిపిన పిమ్మట తీవ్రమైన కోపమూ దానికితగ్గ ధైర్య స్థైర్యములూ, తగినంత వుపాయమూ వుండేటట్టయితే జయాన్ని కలిగించడం తటస్థిస్తుందేమో కాని వక్కకోపం మాత్రమే అయితే అప్పడున్నూ పనిచేయదు. బాగా ఆలోచించి చూస్తే రామాదిమహావీరులు క్వాచిత్కంగా తప్ప యుద్ధరంగంలోకూడా శాంతిప్రధానంగానే వర్తించినట్లు కనపడుతుంది. యెన్నివిధాలఁ జూచినా శాంతికి మించిన ఆత్మరక్షణోపాయం కనబడదు. యిదంతా మనస్సులో పెట్టుకొనే కాఁబోలును! భర్తృహరి

శ్లో. క్షాంతిశ్చే త్కవచేన కింకిమరిభిః క్రో ధోస్తి చేద్దేహినామ్"

అన్నాఁడు. అంటే అన్నాఁడు గాక దీన్ని పాటించే వ్యక్తులుమాత్రం మిక్కిలీ తక్కువ. అట్లని కష్టసుఖాలు యెఱిఁగినవాళ్లు "ఓం శాంతి శ్శాంతిః" అంటూ చెప్పడం మానతారా? మానరు.

సర్వథా శాంతి ఆవశ్యకమనిన్నీ అది యెవరి ప్రకృతికో కాని సహజంగా అలవడదనిన్నీ దాన్ని పెద్దల సేవవల్లా వారువారు వ్రాసిన గ్రంథాల వల్లా అభ్యసించేనా సంపాదించడం అత్యావశ్యక మనిన్నీ కనపడుతుంది. సహజంగాఁగాని, ప్రయత్న పూర్వకంగాఁ గాని సంఘటించిన శాంతిని కాపాడుకోవడం మాత్రం సుఖసుఖాల జరిగేదికాదనిన్నీ భారత పద్యతాత్పర్యం. వదల వలసిన సమయాలల్లో యెంతో యిక్కట్టుగా వుండేది ప్రతిదీ తప్పచేరదు. సత్యాన్ని అతిక్రమించడాన్ని గూర్చి – “ప్రాణవిత్తమాన భంగమందు" అనే వాక్యానికి విపరీతార్థ కల్పనచేసి ప్రతీక్షణమందున్నూ అబద్ధాలాడే వాళ్లలాగ దీనిక్కూడా o