పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/129

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అతిక్షమ దైన్యాపాదకమా?

133


సవరించడానికి యెందఱో మహాకవులు యెన్నో తోవలు తొక్కివున్నారు. కాని అదిమాత్రం వజ్రలేపంగా నిలిచిపోయింది. యిఁక భీష్ముఁడు బ్రహ్మచారి, మహాజ్ఞాని, శాంతియుక్తమైన పౌరుషం కలవాఁడు. అయితే యేమి? తనయావద్ధనుర్విద్యకును మూలభూతుఁడైన పరశురామునితో యెదురుకొని యుద్ధంచేయక తప్పిందికాదు. శాస్త్రాలో! “ఏకాక్షర ప్రదాతారం" అని చెపుతూ వున్నాయి. అది స్వకులధర్మ మవడంచేత, సామాన్య ధర్మాన్ని ధర్మసూక్ష్మం అపవదించిందనుకోవలసి వచ్చింది. స్వకులధర్మమైన యుద్ధం హింసాత్మకమైనప్పటికీ యజ్ఞంలో జరిగే పశుహింసలాగే “ధర్మాదనపేత" మవడంవల్లనే భీష్ముఁడు యెందఱినో చంపిన్నీ నరకానికి వెళ్లినట్లు భారతంలో కనపడదు. గురువుగారితో చేసిన యుద్ధంకూడా దానికిందనే జమకట్టడంచేత కాఁబోలు భీష్మునకు అదిన్నీ నరకాన్ని కల్పించలేకపోయింది. అర్జునుఁడు “పితృసమోజ్యేష్ఠః" అనే శాస్త్రాన్ని ఉల్లంఘించి ధర్మరాజును చంపడానికి వుద్యమించడం, స్వప్రతిజ్ఞా భంగనిర్వహణాని కవడంవల్ల కాఁబోలు! సమర్థనీయమే అయింది. అంతో యింతో ప్రతిజ్ఞా నిర్వహణ ప్రసక్తి వున్నప్పటికీ కేవలం విరుద్ధంగా వున్న కారణంచేత కాఁబోలు ధృష్టద్యుమ్నుఁడు చేసిన ద్రోణవధ యెంత సమర్ధించినా సమర్ధింపఁబడడంలేదు. గురువు ఆయుధాన్ని ధరించి తనతో పోరాడుతూన్నప్పడే అయితే ధృష్టద్యుమ్నుఁడొనర్చినకృత్యం సమర్ధింపఁబడేది. పనిపడితే పరలోకంలో యమధర్మరాజుతో "నేను నిర్దోషినే" అని సమర్థించుకోవడానికి తగ్గదైర్యం యిచ్చివుండేది. కాని అది కేవలం కసాయి వాని కృత్యంగా వుంది. సత్యవతి, కుంతి, మొదలైనవాళ్ల చారిత్ర స్ఖాలిత్యాలుకూడా ధర్మసూక్ష్మా లెఱిఁగిన పెద్దలకు ధర్మాదనపేతాలుగానే కనపడతాయి. సామాన్యులదృష్టికి అన్యథాగా కనపడ్డప్పటికి అంతమాత్రంచేత అవినింద్యాలు కాఁజాలవు. ప్రతి శరీరానికిన్నీ వాతపిత్తాదులతోపాటు సత్త్వరజస్తమోగుణాలు జీవసంబంధం వున్నంత కాలమున్నూ వుండితీరుతాయి. వీట్లకూ వాట్లకూ కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కదానికి వుద్రేకం కలగడం సహజం. దాన్ని ఔషధదులచేతా పరిశీలకత్వంచేతా వారించుకోవడమున్నూ వుంది. ఒక్కొక్కప్పుడు అవి ప్రతిక్రియకు లొంగక విజృంభించి హానికరాలు కావడమున్నూ సర్వానుభవ సిద్ధమే. సత్త్వగుణం యెంత విజృంభించినా కలిగే హానిలేదుగాని తక్కిన రెండున్నూ అలాంటివికావు. వాతాదులకు ఔషధప్రయోగంలాగే జ్ఞానంకూడా వ్యర్థం కావలసివస్తుంది. వొక్కప్పుడు ప్రస్తుత విషయంలో అలాటప్పుడే చెప్పఁదగ్గ జవాబు కనపడక దానికి కర్మని కారణంగా పెట్టుకొని గ్రంథకర్తలు- 'కర్మణో గహనాగతిః' అని వూరుకుంటూ వుంటారు. భవితవ్యం అనివార్యం అంటేనేకాని మనకి కుదురని సందర్భాలెన్నో కనపడతాయి. శ్రీరామునివంటి ధీరోదాత్తుఁడు, శూర్పణఖకు వైరూప్యాన్ని ఆపాదిస్తూవున్న లక్ష్మణుణ్ణి వారించకపోవడం భవితవ్యతామూలకం కాక యేమనుకోవాలి? ఆవైరూప్యా

\