పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



ఏది అహింస?

అహింసను సర్వోత్కృష్టంగా అంగీకరించని వేదంగాని, పురాణంగాని, మతంగాని, జాతిగాని లేదనే చెప్పవచ్చునుగాని యేదో విధంగా అందఱూ చేస్తూనే వున్నారు. దక్షిణ హిందూస్థానంలో వుండే పంచద్రావిళ్లు (బ్రాహ్మలు)న్నూ చాలామట్టుకు వీరి ఆచారాలనే ఆచరించి దినకృత్యాలు నడుపుకొనే వైశ్యులున్నూ, విశ్వబ్రాహ్మణులలో కొందఱున్నూ, యీ హింసకు దూరంగా వర్తిస్తున్నారని చెప్పవచ్చును. బ్రాహ్మణులలో శిష్ణులు "వైశ్వదేవం” చేయటం తప్పని విధిగా జరిగే స్వల్పజంతుహింసవల్ల సంభవించే దోషాన్ని పోఁగొట్టు కోవడానికే.

"పంచసూనాలు" అనేవి తప్పక సంఘటిస్తాయి. చీమలు, చెదపురుగులు, నల్లులు, పేలు, దోమలు మొదలైనవాట్లను బుద్ధిపూర్వకంగా కాక పోయినా హింసించకుండా జీవితం నెఱవేఱదు. వీటిలో నల్లులూ పేలూ అనే వాట్లను చంపకుండా కాలక్షేపం జరుగుతుంది. పందిరి పట్టిమంచాలు వగయిరాలు వదులుకొని చర్మాలమీద పరుండడంవల్ల నల్లులపీడ తప్పుతుంది. కాని ఆ పద్ధతిని చర్మాలకు గిరాకీ యొక్కువగా తగిలి యింతకన్న పెద్ద పాపానికి అవకాశం కలిగించుకున్నట్లవుతుంది. సూలదృష్టిని పోవలసిందేగాని యీ "అహింసను" సూక్ష్మదృష్ట్యా విచారిస్తే మటీ అయోమయంలో పడ్డట్లవుతుంది. మార్వాడీలలో "జైనమతస్థులు" రాత్రి దీపం పెట్టకపూర్వమే భోజనం నెరవేర్చుకుంటారు. నల్లులున్న మంచానికి కొంచెంసేపు తమ శరీరాన్ని విందుగా అర్పిస్తారు. వారిలో సన్యాసులు కట్టిన వస్త్రం వుతకరు. దంతధావనం చేయరు. సూక్ష్మ జంతువులేవో కొన్నిటికి హాని కలుగుతుందనియ్యేవే. యేదేనా అతిలోకిపోతే వెట్టిగా కనపడుతుంది, అందుచేతనే

"అతి సర్వత్రవర్ణయేత్" అన్నారు అభియుక్తులు. యీ అహింసా విషయంలో దాక్షిణాత్య బ్రాహ్మణులు (పంచద్రావిళ్లు) అవలంబించిన మార్గమే శాఘ్యంగా కనపడుతుందిగాని ఆయీ అయిదు తెగలలోనూ ఆంధ్రులున్నూ ద్రావిళ్లున్నూ యజ్ఞాలలో ప్రత్యక్ష పశుహింస చేయడం (వేదసమ్మతమే అయినా) ఘనోరంగా కనపడుతుంది. ఆయీ హింసకు వేదసమ్మతివున్నదని యెఱిఁగిన ఋషులే కొందఱు నిషేధించినట్లు ఆ పురాణవాక్యాలే రుజువిస్తాయి.