పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

భూమి కొలత సందర్భములో దేవమాన మనుష్యమానాల విషయం యెట్లావున్నా అప్పటికాలపు దాతల సౌశీల్యాన్ని మనం ముఖ్యంగా గమనించాలి. అంతేకాక, పాండిత్యంలో యెంతగొప్పతనమున్నా ఛాందసత్వం కొంత దురాశ కలిగింపక మానదనికూడా అనుకోకతప్పదనుకొంటాను. ఆ దురాశవల్ల అవమానం పొందకపోవడమున్నూ పయిగా తమ లౌక్యప్రజ్ఞచేత తాముతరించడమే కాకుండా తమతోపాటు తాటితోదబ్బనంగా ప్రవర్తించిన (పాలెప్పళ్లంరాజు) ఠాణాదారుగారినికూడా తరింపఁజేయడం వగైరా పాపయ్య శాస్రుల్లగారి ప్రజ్ఞావిశేషానికి వుదాహరణంగా మనం గ్రహించవచ్చును. ఆయన గనక సరిపోయింది కాని యిదే మఱో పండితుడికి తటస్థిస్తే రాజావారు మంచివారుకనక శాస్రుల్లు వారికిదక్కితే 18 పుట్ల భూమిన్నీ దక్కేదేమోకాని ఠాణాదారుగారికి వుద్యోగంవూడి “అగ్నేయంతి" సిద్ధమయ్యేది.

రామకవిచాటుధార

ఈ పళ్లంరాజుగారి తుట్టతుదిదశలో, అనగా వారం పదిహేను రోజులలో స్వర్గానికి వెడతారనగా నేనూ వీరిని చూడడం తటస్థించింది. వీరివల్ల ఆరోజున శ్రీ శిష్టు కృష్ణమూర్తిగారికి సంబంధించినవిన్నీ పాపయ్య శాస్రుల్లుగారు వగయిరా ఆ కాలంనాటి వారికి సంబంధించినవిన్నీ చాలా గాథలు విన్నాను. నన్ను ఆయన యెవరిద్వారానో యేకసంథాగ్రాహినిగా వినివున్నారఁట. భోజనమయిన తరవాత కూర్చున్నప్పడు అన్నారుగదా:- వెనక శ్రీ శిష్టు కృష్ణమూర్తిగారికి వుండేది యీ ప్రజ్ఞ యిటీవల తమకు వుందని విన్నాను. యేదోవకపద్యం చదువుతాను మళ్లా మీరు చదవాలంటూ అడగడానికి మొదలుపెట్టారు. ఆ యీ గాథ వికారి సంవత్సరం నాఁటిది. అప్పుడే నాకు కొంచెం బుద్ధిబలం తగ్గడ మారంభించడంచేత, తెనాలిరామలింగంగారి - "ప్రాయపు ప్రొద్దంత కొంత పడమటఁదిరిగెన్” అనే స్థితిలో వున్నాను. అంతకుముందైనా యేవోకొన్ని పద్యాలు మాత్రమే యేకసంతకు వస్తాయిగాని అన్నీరావు. అర్థం తెలిసేవైతే రావడాని కభ్యంతరంవుండదు. కాని అప్పటిస్థితిలో అలాటిది కూడా యేకసంతకు రావడం అనుమానాస్పదమే. ఆ యీ సందర్భాలు వున్నవివున్నట్లుగా చెప్పేటప్పటికి ఆయన అన్నారుగదా; పోనీ రెండుసంతలకు చదివినా చాలునని యీ క్రింది పద్యాన్ని చదివారు. -

ఉ. పెండెలనాగి చెక్కులను పెద్ది కటిస్థలి, గంగిగుబ్బచన్
గొండల నుండు రామకవికుంజరు హస్తము క్రిందుచేసె,
హా! పండక బంటుమిల్లి, అది పండిన యీ కసుమాలధారుణీ
మండలనాథుఁబోలు నొక మానవనాయకు వేఁడనిచ్చునే?