పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు

15


అన్యథాగా వర్తించడంవల్ల బరతరపుచేశాం కాని మీ యందు మాకు లేశమున్నూ అనాదరం లేదే" అన్నారట. దానికి శాస్రులుగారు చెప్పిన జవాబేమిటంటే:- "అయ్యా ఆయన మీ యాజ్ఞకు లేశమున్నూ వ్యతిరేకించలేదు. యేమంటారా? పండైండుపుట్ల భూమి మీరు మాకుకొలిచి వప్పజెప్పవలసిందనేకదా ఆయనకాజ్ఞాపించి ఉన్నారు. ఆయన అట్లే వప్పగించారు. దీనిలో ఆయన తప్పేముందన్నారట." రాజావారు “12 టికి 18 పుట్లు యివ్వడం తప్పకాదా" అన్నారట. పాపయ్యశాస్రులుగారు అన్నారట:- "అయ్యా మాకు మీరు భూమి యివ్వడం యెందుకువచ్చిందని ప్రశ్నించారట. మీరు జగదేక పండితులనే కారణంచేత యిచ్చి తరించాలనేవుద్దేశంచేత నన్నారంట. సరేఎందులో పండితులమని మీవుద్దేశమన్నారట? వేదశాస్తాలలో అన్నారంట. అవి యే భాష అన్నారంట. గీర్వాణబాష అన్నారట రాజావారు. గీర్వాణభాష కదా, గీర్వాణులంటే దేవతలే కదా? మేము ఆ భూమి దేవమానంచేత కొలిపించు కొంటాంగాని మనుష్య మానంచేత యేలాకొలిపించు కొంటామని తమరనుకున్నారంటూ చెప్పియేలాగయితేనేమి గజానికి గజమున్నర చొప్పన లెక్కకట్టి సరిపెట్టి రాజావారికి నచ్చంజెప్పి మళ్లా ఆ ఠాణేదారు వుద్యోగం ఠాణేదారుకిప్పించి తమ భూమిని తాము నిల్పుకున్నారంట. ఆ భూమి అంటే సామాన్యమైనదికాదు, లంకభూమి. యితరత్ర వకయకరం యెంత ఖరీదో అక్కడ వక సెంటు అంతఖరీదు చేస్తుందన్నమాట. అది యిప్పటికిన్నీ వారి కుటుంబీకులు అనుభవిస్తున్నారు.

శాస్త్రులుగారి లౌక్యప్రజ్ఞ

చెప్పేదేమిటంటే, అట్టిమహాదాత రాజావారు. వారిగురువులదర్శనానికి వెడుతూ, రమ్మంటే రానని శాస్రులుగారు ఎలాచెప్పఁగలరు? "అర్ధస్య పురుషో దాసః" అన్నాండుగదా భీష్మండంతటివాడు. ద్రోణాదులు కూడా ఈమాటేచెప్పారు ధర్మరాజుతో, అయితే పాపయ్య శాస్రుల్లుగారు మహాలౌక్యులు. తుదకు వెళ్లకుండా చమత్కారంగా తప్పించుకున్నారని వినికి. యేంచేశారంటే:- అయ్యా మా స్మార్తమతం సర్వమతాలని సహిస్తుంది. వానమామలస్వామి దర్శనానికి రావడం నాకు లేశమున్నూ బాధకంకాదు. కాని నన్ను చూడడం వారికి బాధకంగా ఉంటుంది. విభూతి రుద్రాక్షధారణతో వున్నవారిని సామాన్యంగా శ్రీవైష్ణవులే చూడడానికి సంశయిస్తారు. అందులో వారు గురుపీఠంగదా? అట్టివారు సంశయింపకుండా వుంటారా? వకవేళ తమతోవచ్చిన హేతువుచేత యేలాగో స్వామి సహించి వూరుకొన్నా శిష్యులవల్ల ముందుముందేనా వారికి ఆక్షేపణ కలగడంతప్పదు. అనేటప్పటికి రాజావారు వారిలౌక్యప్రజ్ఞకు సంతోషించి వారిని వెంటఁబెట్టుకొనివెళ్ల కుండానే గురువులవారి దర్శనానికి దయచేశారంట!