పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీసమాలికలోఁ బేర్కొనఁబడిన రాయనభాస్కరుఁడు ప్రాచీనుండుగాఁ నూహింపఁదగియున్నాఁడు. ఆతఁడు మహాదాత. ఆరాయని భాస్కరునిఁ గూర్చి చెప్పఁబడిన చాటుపద్యము లనేకములు గలవు.

క. పన్నిద్దఱు భాస్కరులని
    యెన్నికసేయుటది కల్ల యిద్దఱు గా దా
    మిన్నున నొకభాస్కరుఁడును
    బన్నుగ వినుకొండనున్న భాస్కరుఁ డొకఁడున్.
క. పసముత్య మొకటి చాలును
    గస వూడ్చిన చింపిరాలు గంపెం డేలా?
    రసికుం డొక్కఁడె చాలును
    రసహీనులు పదువురేల రాయనిబాచా!
క. చేకొని రాయని బాచఁడు
    కాకాలు గుణించు పిదపకాలమునాఁడే
    లాకేత్వ మియ్యనేరఁడు
    దాకును గొమ్మియ్యఁ డిట్టి ధన్యులు గలరే?
క. ఏవ్రాలైనను వ్రాయును
    నావ్రాయఁడు వ్రాసెనేని నవ్వుచునైనన్
    సీ వ్రాసి తావ డియ్యఁడు
    భావజ్ఞుఁడు రాయనార్య భాస్కరుఁ డెలమిన్.
క. వగమాన్పి యర్థి కియ్యని
    మగముండకు మీస మేల మఱిమూతిపయిం
    దెగగొఱుగఁ డాయె మంగలి
    రగడందునఁ గీర్తిదోఁచ రాయనిబాచా.