Jump to content

పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవరత్నములు

35

కవి యీతని కంకితముగా జైమినిభారతము రచియించెను. ఈతనిపేర “నవరత్న”పద్యములును “సప్తాంగపద్ధతి”పద్యములును రచింపఁబడినవి. వీనికిఁ గర్త పినవీరభద్రుఁడు కాఁదగును.

నవరత్నములు

సీ. దినదినంబును నెల్లదివిజులఁ బోషించుఁ
                    గైరవబంధుఁ డేకార్యకాంక్ష?
    అప్పటప్పటికి లోకాంధకారము మాన్చు
                    నినుఁ డేమిలాభంబు నిచ్చగించి?
    సచరాచరం బైనజగతియెల్ల భరించు
                    ఫణిపతి యేఫలప్రాప్తిఁ జూచి?
    అదనున వర్షించి యఖిలజీవులఁ బ్రోచు
                    జలధరం బే ప్రయోజనము గోరె?
గీ. పరహితం బాత్మహిత మని పరమపుణ్యు
    లన్యు లొనరించుమేలు తా రాసపడరు
    సకలభాగ్యోదయ కఠారిసాళువాంక!
    గుండభూపాలునరసింహమండలేంద్ర!
సీ. ఆకారసంపద ననుకరించినవిద్య
                    విద్యకుఁ దోడైన వినయగుణము
    వినయగర్భిత మైన విక్రమారంభంబు
                    విక్ర మార్జితమైన విభవగుణము
    విభవానుగుణమైన వితరణోన్మేషంబు
                    వితరణోపేతమై వెలయుప్రియము
    ప్రియవచోనిరతమై పెంపొందు సత్కృతి
                    సత్కృతిఁ జేకొన్న చారుకీర్తి