పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొదటికూర్పు.


తొలిపలుకు.

తీరుతీయములు గల భాషావాహినియందు సుకవుల కవితామృతము ప్రబంధరూపమునన కాక చాటురూపమునను జాలువాఱును. వీనులకు విందులై డెందమును దనుపార్చుచుఁ జాటురచనము లొక్కొకయెడఁ బ్రబంధరచనముల సయితము మీఱియుండునని చెప్పుట భాషావేదుల కనుభవపునరుక్తమగును. గ్రంథములుగా నేర్పడామిచేఁదొల్లింటియాంధ్రకవీశ్వరులు రచించిన చాటుపద్యము లెన్నేని యినికితప్పినవి పరంపరాగతములగుచుఁ గొన్ని పల్లెటూళ్లలో ముదుసళ్లనోళ్లయందును మఱికొన్ని పురువులకు భుక్తులువెట్టు ప్రాచీనతాళపత్ర సంపుటములందును జీర్ణించుచున్నవి. ఇంపారు నిట్టిపద్యముల సంపాదించి గ్రంథరూపమున వెల్వరింపఁ దలంపుగొని యెఱిఁగినవారినెల్ల నడిగియు దొరికిన తాళపత్రసంపుటమెల్లఁ బరిశీలించియు నానాఁటఁ గొన్నిచాటువులఁ గూర్చితిని.