పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నెల్లూరు

29

    ప్రవహించు నేవీట బ్రహ్మాండకర్పరం
                    బొరసి మిన్నులుముట్ట నున్న పెన్న
    చెలు వందు నేవీటఁ జిరకాలజీవన
                    స్వర్ణాలచెఱువు సంపూర్ణమగుచు
గీ. ప్రజలకును మన్కి సకలసంపదలకునికి
    భోగములవీడు సురపతిపురికి నీడు
    నమ్మికలటెంకి వైరులఁ జిమ్ముకొంకి
    భాగ్యనికరంబు నెల్లూరు పట్టణంబు.
సీ. ఏపట్టనంబున నెన్నంగ మున్నూట
                    యఱువది దేవాలయంబులుండు
    ఏపట్టనంబున రూపింపనన్నియు
                    నీరేడు బావు లింపారుచుండు
    ఏపట్టనంబున నెల్ల మానవులుఁ బ్ర
                    శస్తిగాంచిరి నెఱజాణలనఁగ
    ఏపట్టనంబున నే కొలమును బెన్న
                    కాల్వలచేత ముక్కాఱుఁ బండు
గీ. శివునికృపఁ బుట్టె వేమాలసెట్టిబావి
    పరఁగ జగ మెల్ల నెఱుఁగ నేపట్టణమున
    నట్టిపట్టణ మిలను సౌఖ్యముల కునికి
    పట్టనందగు నెల్లూరుపట్టణంబు.
సీ. చరియించితిని గాని జగము మూలస్థాన
                    పరమేశ్వరునివంటి భక్తవరదు
    విహరించితిని గాని వివిధభూములు [1]పల్లి
                    కొండనాథునివంటి కూర్పువేల్పు

  1. పల్లికొండనాథుఁడు, శయనించినస్వామి, రంగనాథుఁడు