పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

చాటుపద్యమణిమంజరి

శ్రీ నారాయణస్తుతి

మ. ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై
     పరమామ్నాయము లెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై
     సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీ గంగ సత్పుత్రియై
     పరుస న్నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణా!

శ్రీకృష్ణస్తుతి

గీ. చేత వెన్నముద్దచెంగల్వపూదండ
     బంగరుమొలత్రాడు పట్టుదట్టి
     సందెతాయెతులును సరిమువ్వగజ్జెలు
     చిన్నికృష్ణ! నిన్నుఁ జేరి కొలుతు.

త్రిమూర్తిస్తుతి

చ. కమలజకృష్ణ శంకరులు కాంచననీలపటీరవర్ణు లా
     గమనగచంద్రధారు లఘకంసపురారులు హంసతార్క్ష్యగో
     గమనులు జన్మపుష్టిలయకారులు వాక్కమలాంబికేశ్వరుల్
     శమకరుణావిభూతిగుణశక్తులఁ బ్రోతురు మిమ్ము నెప్పుడున్.

శ్రీరంగనాథస్తుతి

ఉ. సింగపుమోమువాఁడు తులసీదళదామమువాఁడు కామినీ
     రంగదురంబువాఁడు వలరాయనిఁ గాంచినవాఁడు భక్తి కు
     ప్పొంగెడువాఁడు దానవులపొంక మడంచెడివాఁడు నేఁడు శ్రీ
     బంగరురంగశాయి మనపాలఁ గలండు విచార మేటికిన్.