పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమతరంగము

73

సిన” దని యాహ్వానము వచ్చెను. రాజు వెంకనఁ జూచి మీదేగ్రామ మన నాతఁడు మాది ‘తెట్టు’ అని చెప్పెను. అప్పుడు రాజు తెట్టేనా? యని యించుక నిర్లక్ష్యభావమును సూచింపఁగా నీకవి, మహారాజా! తెట్టన నంతచులకనఁగా జూడకుఁడు

ఉ. తెట్టు కుమారకృష్ణజగతీవరవందన! రాజ్యలక్ష్మికిన్
   బట్టు; ధరాంగనామణికిఁ బాపటబొట్టు; రిపూరగాళివా
   కట్టు; సముజ్జ్వలద్ధృతికి గట్టు; బుధాళికి వేల్పుఁజెట్టు; వా
   గ్దిట్టల కున్కిపట్టును మదీయనివాసము యాచభూపతీ!

అని యాశువుగా పద్యముం జదువ రాజు సంతసించి అయ్యా! తమపే రేమన,

క. నాపేరు వేంకనందురు
   భూపాలకమకుటనీలపుంజమిళిందో
   ద్దీపితపాదాంబుజకరు
   ణాపర! వెలుగోటియాచనరనాథేంద్రా!

అని మరల నాశువుగా జవాబు నొసంగ నారా జచ్చెరువంది, అయ్యా! తమ రాశువుగా గంట కెన్ని పద్యములు చెప్పఁగలరని యడుగఁగా గంటకు నూఱుసమస్యల నాశువుగాఁ బూరింపఁగలనని కవి ప్రజ్ఞఁ బలికెనఁట. ఆసమయమున ఆస్థానకవులచే నియ్యఁబడి యీకవిచేఁ బూరిపఁబడిన సమస్యలు చాల కలవు. ఇందు రసోత్తరములుమాత్ర ముదాహరింపఁబడును. ఈసమస్యలను ప్రభువే యొసంగెననువాఁడుకయుఁ గలదు.