పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమతరంగము

55

థుఁడు కళవళపడి, చేతనున్న తాటియాకులపుస్తకము నట్ల వడిచి బొమలు ముడివెట్టి, అల్లునివంకఁ జూచి ‘దీని నిదివఱ కెవ్వరు తెలిఁగించితిరిరా’యని యాతురతతో నడిగెను. మల్లన చిఱునవ్వు నవ్వి ‘మానాయనగారు చాలకాలము క్రిందటనే తెలిఁగించియున్నరే’ యనెను. ఆమాట చెవినిఁ బడఁగానే మఱింత కళవళముఁ జెంది, ‘యేమిది? దీని నిదివఱ కెవ్వరును తెలిఁగించియుండలే దనునమ్మకముతే, నా బుద్ధిబలమునంతయు ధారవోసి దీనిఁ దెలిఁగించితిని. పోతనయే తెలిఁగించెనా. తెలిగించెనే యనుకొందము. మాటమాత్రమైన, నాతో ననక రహస్యముగా నుంచునా’ అని యేమేమో యోజించి యోజించి, మల్లనమాటలు గల్లలుగాఁ దలపోసి, దీనితో సర్వముఁ దేలఁగలదని నిశ్చయించుకొని, ‘మీతండ్రిగారినైషధములోని పద్యమొకటి చదువు’మని మల్లన నడుగఁగా, నాతఁడు వెలవెలఁబోక, ‘యేపట్టునఁ జదువుమనియెద’ రనెను. శ్రీనాథుఁడు గొంకుచు, ‘దయయంతి విరహగ్లాని నెట్లు వర్ణించెనో, ఆపట్టునఁ జదువు’ మనెను. అప్పుడు మల్లన యీక్రిందిపద్యము నల్లనఁ జదివెను.

గీ. కాంత కలఁదిన చందనకర్దమంబు
   ఉగ్రవిరహాగ్నిఁ దుకతుక నుడికి చెదరి
   చెంత నున్నట్టి దమయంతి చెలిమికత్తె
   మెఱుఁగుఁబాలిండ్లపైఁ బడి మిట్టిపడియె.

శ్రీనాథుఁ డీపద్యమును విని పోతన నైషధముఁ దెలిగించినాఁడని నమ్మి, యేమియుఁ దోఁపక మిన్నకుండెను. ఇంతలోఁ