పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమతరంగము

29

ఈకవి కమసాలి. ఒకానొకప్పు డితఁడొక సంస్థానపతి దర్శింపనేఁగఁ దదాస్థానమున నున్న భద్రయ్య యనునొకనియోగికవి ‘రుద్రకవిని రానిచ్చినఁ దనపేరు దక్క’ దను తలంపుతో నాతనిరాక రాజుగారికిఁ దెలియకుండ గట్టుబాటుఁ జేసెను. రుద్రకవి కొంతకాల మట్లేకడిపి సంస్థానముం జొచ్చు నుపాయము తోఁపక తుదకు రాజుగారి మంగలియగు కొండని నాశ్రయించెను. ఒకనాఁడు కొండడు వచ్చుట ఆలస్యమయి రాజుగారు కురిచీపైఁ గూరుచుండి యట్లే కూరుకుఁజెందిరి. నిదురఁబోవుచున్న రాజు కదలకుండఁ దనపని ముగించుకొని కొండఁడు ప్రక్కన నిలిచియుండెను. ఒకటి రెండునిమిషములకు రాజుగారు మేలుకని, యెదుటనున్న మంగలిఁ గని “యేమిరా, నేడింతయాలస్య” మన వాఁడు “మహాప్రభూ! నేను వచ్చుచుండఁగాఁ ద్రోవలో నొకకవి తటస్థమయి ‘నేనిట నెలదినములనుండి రాజదర్శనమునకై వేచియున్నాను. భద్రకవి యేకారణముననో నా రాకను రాజుగారికిఁ దెలియనీయకుండఁ జేయుచున్నాఁ’ డని యేమేమో తన సంగతులను జెప్పుకొనసాగెను. ‘అయ్యా! నేను త్వరగాఁ బోవలయు’ నని చెప్పి వచ్చితి” నని మనవి చేసెను. అందుపై ప్రభువు “భద్రకవి యింత యసూయాపరుఁడా? చూచెదముగాక” అనుచు “ఓరికొండా! నీపనిఁ గాని” మ్మనియెను. వాఁడు “మహారాజా! అఱగంట క్రిందనే అయిన” దని మనవి చేయుచు నద్దము నెదుట నిల్పెను. కొండనికౌశల్యముకు రాజు