పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిడుకుచుండ భీమకవి యీక్రింది పద్యము నొసంగెనఁట. ఆపద్యముతో నాబ్రాహ్మణుఁడు తనకార్యమును జక్కఁబెట్టుకొనెనఁట.

ఉ. నవ్యవిలాసరమ్యనలినం బని బాలముఖాబ్జసౌరభా
   భివ్యసనంబునం దిరుగు భృంగకులోత్తమ! తద్వియోగతా
   పవ్యధఁ బ్రాణినిల్వదు; కృపాగుణ మేర్పడ “బ్రాహ్మణో న హం
   తవ్య” యనంగ నొప్పు వచనస్థితిఁ గుంద కెఱుంగఁ జేయుమా.

భీమకవి యొకతఱి నొకకుగ్రామమునకుఁ బోయి యుండి జన్నమాంబయను నొకవిప్రవితంతువును “వంటఁజేసిపెట్టు” మని కోరఁగా నాపె “అయ్యా! నేను గండమాలావ్రణముతో నల్లాడుచున్నాను; నాకిప్పుడు వంటఁజేయశక్తి లే” దని విన్నవించెను. అందుపై భీమన “అమ్మా! యీగండమాలఁ బోఁగొట్టిన వంటఁజేసి పెట్టెదవా?” యని యడుగ “మహానుభావా! తమకంతటి యనుగ్రహము రావలయునుగాని వంటఁజేయుట కేమియభ్యంతర” మనెను. అప్పుడు భీమకవి

క. ఘనరోగంబులబలమా
   కనుఁగొనఁగా జన్నమాంబకర్మపుఫలమా!
   నినుఁ బ్రార్థించెద వినుమా!
   మునుకొని యోగండమాల మునగకుఁ జనుమా.

అను పద్యమును జెప్పఁగా నావిశ్వస్తకంఠముననున్న వ్రణము మునగచెట్టునకుఁ జేర నంతట నామె యత్యంతానందభరితయై కవీంద్రునకు షడ్రసోపేత మగు భోజనముం బెట్టి తనకృతజ్ఞతను జూపెను.