పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయతరంగము

155

టాద్రినాయఁడు బహుప్రయత్నమునఁ బట్టించి, తలారులచే వారితలలు నఱికించి జనులకుఁ జోరభీతిని మాన్పెను. త్రాసునందు తానొకప్రక్కఁ గూర్చుండి రెండవప్రక్కనఁ దనతూకమునకు సరిగా బంగారము వేయించి—తులాభారముఁ దూగి—ఆబంగారమునంతయును విప్రులకుఁ గవులకును దానముఁ జేసెను. భూలోకదేవేంద్రుఁ డనుపేరుఁ బొందెను. అమరావతి, వైకుంఠపురము మొదలగు ననేకగ్రామములను గట్టించెను. ఈవేంకటాద్రినాయఁడు నింద్రునివలెనే యమరావతి కధినాథుఁడై నందవనమునుగూడ ప్రతిష్ఠించెను. ఈతఁడెన్నియో దేవాలయములను కట్టించెను. ఈపుణ్యపురుషుని గుఱించిన చాటువు లనేకములు గలవు. అందుఁ గొన్నిమాత్రమే దొరకినవి.

సీ. శ్రీకృష్ణవేణికిఁ జెలు వొప్పఁ బడమర
               సిరిఁ దేజరిల్లు లక్ష్మీపురంబు
   ఆయూరి కుత్తరం బతిరమ్య మైనట్టి
               కుదురైన భైరవగుట్ట కలదు
   పశ్చిమభాగానఁ బరభయంకర మైన
               సౌరొప్పు మేదరసాల కలదు
   దక్షిణమ్మున నీదు తల్లి పేరిఁట నొప్పు
               ప్రేముడి యచ్చమ్మపేట గలదు
   మేటిరాజులు మన్నీలు మిమ్ముఁ గొలువ
   గజతురంగంబు లిరుగడఁ గదిసి నిలువ
   వసుధఁ బెంపొందితివి భళీ? వాసిరెడ్డి
   వేంకటాద్రీంద్ర! మన్యహం వీరచంద్ర!