పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయతరంగము

101

ఉ. భూరివదాన్యదమ్మళపుపుల్లపమంత్రిగుణాఢ్యసత్పదాం
   భోరుహయుగ్మముం గడిగి పుణ్యజలంబులు లోభిమంత్రిపైఁ
   జేరెఁడు నెత్తిఁ జల్లి యరచేరెఁడు లోపలికిచ్చినన్ మహో
   దారమనస్కుఁడై యతఁడు ధారుణిఁ గీర్తి వహింపకుండునే?

ఈయమాత్యుఁడు మల్రాజువారితరఫున నేజెంటుగా నుండెను. అప్పుడు తాను వసూలు చేయుచుండిన శిస్తుపయికము నెప్పటి దప్పుడే బ్రాహ్మణసంతర్పణలకును గవీశ్వరబహుమానములకును వెచ్చ పెట్టుచుండెను. ఒకసమయమునఁ బయికము నంతయును దివాణమునకుఁ బంపవలసిన దని జమీన్దారు లుత్తరువులు పంపిరి. ఏజంటుగారిచేతిలో నొకదమ్మిడియు లేదు. అప్పుడు పుల్లప్ప యేమియుఁ దోఁపక, పల్నాడుతాలూకాలోని గుత్తికొండయను గ్రామమునకు కాపురము లేచిపోయెను. ఆకాలమున నాగుత్తికొండ రామరాజువారిపాలనముక్రింద నుండెను. అప్పుడు మల్రాజువారియాస్థానకవియు, ఆకుంకలగుంటగ్రామనివాసియు నగు బట్టుకవి ప్రభువుగారితో నిట్లు మనవి చేసెనట!

ఉ. రాముఁడు లే నయోధ్యవలె రాజిలెఁ గుంకలగుంట పుల్లప
   గ్రామణి గుత్తికొండనగరానకుఁ బిల్లలతోడఁ జేరఁగా
   స్వామి పరాకు నామనవిఁ జక్కగ నీమదినుంచి యంచితో
   ద్దాముని దమ్మళాన్వయునిఁ దప్పక తోఁడుకరావె ధీమణీ!

అంతట సంస్థానాధీశులు పుల్లప్పను మరలఁ బిలిపించి, యథాప్రకారము తమయేజంటుగనే యుంచుకొనిరఁట.