పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

చాటుపద్యరత్నాకరము

ఉ. పెట్టక కీర్తిరాదు వలపింపక యింతికి నింపు లేదు తాఁ
   దిట్టక వాదు లేదు కడు ధీరత వైరుల సంగరంబులోఁ
   గొట్టక వాడలేదు కొడు కొక్కఁడు పుట్టక ముక్తి రాదయా
   పట్టపురాజుకైన నిది పద్ధతి పెమ్మయసింగధీమణీ!

ఉ. సత్యములేనిచోటఁ దనుసమ్మతిఁ జెందనిచోట సాధుసాం
   గత్యమునేనిచోట ధనకాంక్షమునింగినచోట శత్రురా
   హిత్యములేనిచోట ఋణమీయనిచోటను గాపురంబుఁ దా
   నిత్యముఁజేయరాదు సుమి నిక్కము పెమ్మయసింగధీమణీ!

ఉ. బూరుగుమ్రానియున్నతియుఁ బూవులుఁ బిందెలుఁ జూచియాసతోఁ
   గీరము లారు నెల్లు తమకించుచునుండి ఫలాభిలాషితన్
   జేరి రసంబుఁ గ్రోలుటకుఁ జించినదూదియు రేఁగునట్టు లా
   కూరిమిలేనిరాజులను గొల్చుట పెమ్మయసింగధీమణీ!

ఉ. మనవికి నొక్కయేడు ననుమానపుమాటకు నాఱునెల్లు నే
   డనిపెదనన్న మాసమవు నన్పెదపొమ్మనఁ బక్షమౌను తత్
   క్షణమిదె యంపితన్న మఱిసంతయు వచ్చును మోక్షమింక నా
   మనవికి యెన్నఁడో? సుజనమాన్యుఁడ! పెమ్మయసింగధీమణీ!

ఉ. మాడలమీఁద నాస గలమానిసి కెక్కడికీర్తి కీర్తిపై
   వేడుక గల్గునాతనికి విత్తముమీఁద మఱెక్క డాస? యీ
   రేడుజగంబులందు వెల హెచ్చినకీర్తిధనంబు గాంచి స
   త్ప్రౌఢయశంబుఁ జేకొనియె బమ్మయసింగఁడు దానకర్ణుఁడై.

ఉ. పద్దెము లోభికేల? మఱిపందికి జాఫరుగంధ మేల? దు
   క్కెద్దుకు పంచదారటుకు లేల? నపుంసకుఁ డైనవానికిన్
   ముద్దులగుమ్మ యేల? నెఱముక్కర యేల వితంతురాలికిన్?
   గద్దకు స్నాన మేమిటికిఁ గావలెఁ? బెమ్మయసింగధీమణీ!