పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

చాటుపద్యరత్నాకరము

రామలింగభాస్కరుఁడు పిన్నవయసున విద్యాభ్యాసము చేయుచుండఁగా నొక బట్టు వచ్చి రామలింగభాస్కరుఁడు వినునట్లుగా

క. రాయనిభాస్కరుతోనే
   పోయెఁ జుమీ కీర్తికాంత.....

అనెనఁట! వెంటనే రామలింగభాస్కరుఁడు తనకరముననున్న మణికంకణమును దీసి బట్టు కొసంగి— పోదె—అనెనఁట! అది విని యచ్చట మఱియొకఁడు—మఱేదీ—అనెనఁట! అప్పు డాబట్టుకవి పద్యము నిట్లు పూర్తిచేసెనఁట.

   ఆయనమనుమఁడు చతురో
   పాయుండగు రామలింగభాస్కరుఁ జేరెన్.

సీ. ఏమంత్రిసత్కీర్తి హిమసేతుపర్యంత
               మవనిమండలము ముత్యాలశాల
   ఏమంత్రిమొగసాల యేప్రొద్దు చూచిన
               సంగీతసాహిత్యసరసగోష్ఠి
   ఏమంత్రియిలవేలు పిందురేఖామౌళి
               చౌడేశ్వరీమహాశంభుశక్తి
   ఏమంత్రి సౌందర్య మిందీవరాక్షుల
               వాలారుఁజూపుల వలపుముద్దు
   అతఁడు హరిదాసవంశాబ్ధి కబ్ధిభవుఁడు
   అర్థిదారిద్ర్యగాఢతమోర్కుఁ డతఁడు
   దానధర్మపరోపకారానుకూలి
   భాస్కరుని రామలింగన్న భాస్కరుండు.