పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

చాటుపద్యరత్నాకరము

నఁట. తత్క్షణమే యాచమనాయఁడు తనయపరాధమును క్షమింపుఁడని ప్రార్థించుచు మఱల నాకవికిని ఆవ్యాకరణపండితునకును దగిన బహుమాన మొనరించి కృతార్థుఁ డయ్యెనఁట.

పిమ్మట నొకనాఁ డీవేంకనకవి వినుకొండపురమున కేఁగి శ్రీరాజామలరాజు వేంకటనరసింహారాయప్రభువుం దర్శింపఁగా నాప్రభువు—ఇతఁడేనా వెంకన? అనెనఁట! అపుడు కవి—అయ్యా వెంకన యితఁడే కాని

మ. ఇతఁడేనా? వినుకొండనామకమనోభీష్టార్థకృత్పట్టణ
   స్థితసామ్రాజ్యరమాదయామృతఝరీచంచత్కటాక్షేక్షణ
   ప్లుతసర్వాంగసమస్తశోభనకళాపుంఖీభవత్స్తుత్యసం
   గతమల్రాజవరాన్వయప్రభవవేంకట్నర్సధాత్రీశ్వరుం;
   డితఁడేనా?—ఇతఁడేనా?—

అనెనట! ప్రభువుగారు వేంకనకవీంద్రుని యసాధారణాశుధారాపాండిత్యములకును ధైర్యమునకును సంతోషించి బహూకరించి పంపిరఁట.

బుచ్చయ్యశాస్త్రి

పంచచామరము. అమీరునంతవానికైన నర్థి జంకఁబోవునా?
               ఢమాముబెట్టుకైనఁ గుండటంకి హెచ్చి మోగునా?
               కమానుఁబట్టలేనిగ్రద్దకయ్య మెర్గఁబోవునా?
               కుమానవాచలేంద్ర! తాడిగొట్లచెన్నకేశవా?