పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమతరంగము

87

స్తోత్రములు చేసిరి. అప్పుడు వేంకన తనయొద్దనున్న నూటపదియాఱు రూప్యముల నాసభలోని పండితుల కొసఁగి పిమ్మట తన కొసంగిన జరీపుట్టములను పేలికలుగాఁ జించి యొక్కొక్కపండితున కొక్కొక్కపేలిక నిచ్చెను. అప్పు డందఱును నివ్వెరపడి చూచుచుండిరి. మంత్రిగా “రయ్యా! ఇదేమి యన్యాయము? అంత విలువగల పుట్టములను గోచులుగాఁ జించినా”రని యడుగఁగా నాకవిచంద్రుఁడు కోపోద్దీపితుఁడై—

క. యాచమనాయునిత్యాగము
   గోచులకే కాక కట్టుకోకలకౌనా?
   రేచర్లగోత్రమందున
   నీచుం డుదయించి కులము నీఱుగఁ జేసెన్.

అను పద్యముం జెప్పెనఁట! అప్పుడు రాజుగారు “కవీంద్రా! తమ రింత రౌద్రమూర్తు లగుటకుఁ గారణమేమి సెలవిం”డని కోరఁగా మఱింతకోపము రేగి

ఉ. తిట్టుదునా భుజంగవిషదిగ్ధదవానలధాగధైగచి
   ట్చిట్టచిటార్భటీప్రకటశీఘ్రమహోగ్రతదుష్టశిక్షణో
   ద్ఘట్టనవిస్ఫులింగలయకారణదారుణలబ్ధలుబ్ధరా
   ట్పట్టణగోపురధ్వజనిపాతహతాహుతి గాఁగ నుద్ధతిన్.

అని పద్యముం జెప్పెనట! తరువాత పండితు లందఱి ప్రార్థనలపై వెంకన శాంతింజెంది తనకోపకారణమును వచించె