పుట:Chanpuramayanam018866mbp.pdf/38

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24 చంపూరామాయణము

చ. రవి యజముం, గుజుండు మకరంబు, తుల దినరాజసూనుడుం
గవి తిమి నొందఁ జెంద గురుకర్కటలగ్నమునందు శుద్ధపు
న్నవమిఁ బునర్వసున్ బుధదినంబున నొక్కవెలుంగు కోసలో
ద్భవజఠరారణిం బొడవుదాల్చెఁ బలాశసమిద్దిధక్షువై. 48

మ. దివిజప్రాణసమీరణగ్రహిళపఙ్క్తిగ్రీవమాయాభుజం
గవిభంగప్రద మైనపూనిక విహంగస్యందనుం డీగతిన్
రవివంశంబు నలంకరించెఁ దన శ్రీరామాభిధానంబు స
త్కవిసందర్భములం దవంధ్య మగుసౌగంధ్యంబు సంధిల్లఁగన్. 49

క. ధరణీవరునియనుంగుం, దరుణీమణి కమితనయుఁడు తనయుఁడు పొడమెం
జరణాంభోరుహనతసం, భరణప్రారంభరతుఁడు భరతుఁ డనంగన్. 50

క. మిత్రకులజలధిమణులు సు, మిత్రకు నుదయించి రప్రమేయతరశ్రీ
వృత్రఘ్ను లైన లక్ష్మణ, శత్రుఘ్ను లమిత్రనగరసత్రఘ్ను లనన్. 51

చ. విరచితజాతకర్ము లభివృద్ధులునై యలరాకొమాళ్లనం
తర ముపనీతులై చదువునం బలుసాదనలం బ్రవీణులై
కరితురగాధిరోహముల గద్దఱులై విలువద్దెలందు నే
ర్పరు లయి చాతురంగరణరంగసమర్థులు నైరి ధారణిన్. 52

సీ. పుంవ్యక్తులై తోఁచు పురుషార్థములరీతిఁ దనువు గైకొన్న వేదములపగిది
నయనగోచరము లైనయుపాయములఠీవి నరులైన జలనిధానములకరణి
సుఖదర్శనతఁ గన్నశిఖిశృంగములభంగి ప్రభులైన ధాతృవక్త్రములభాతి
నడవడి గలదివ్యనాగదంతములట్లు బాహుజు లగుశౌరిబాహులక్రియ
గీ. ధర్మముఖ్యత నిత్యసత్యత నయాను
సృతి గభీరిమ శుచిభవోన్నతియు వాఙ్ము
ఖాకృతిఁ బలాశహృతియుఁ బంచాయుధాతి
విలసనముఁ బూని వెలసి రన్నలువు రంత. 53

చ. నలినహితాన్వయేశుఁ డొకనాఁ డినుఁ డిందిరయిండ్లబీగము
ద్రలు కరకుంచి విఘటితం బొనరింపకమున్న గాయకా
వళి నుతిగీతి మేలుకని వచ్చి యహర్ముఖనిత్యకృత్యము
ల్సలిపి మణీమయాభరణజాలవిడంబితరోహణాద్రియై. 54