పుట:Chanpuramayanam018866mbp.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

చంపూరామాయణ పీఠిక

కవికాలనిర్ణయము

ఈకృతి యొనర్చినకవి కవిరాజకంఠీరవబిరుదాంకితుఁడును వాసిష్ఠగోత్రజుఁడును నగుఋగ్వేదికవి వేంకటాచలపతి. ఆశ్వాసాంతగద్యములయందు "ఋగ్వేదికవి తిరువేంగళార్యకలశరత్నాకరసుధాకరఁ"డని తన్ను వర్ణించుకొనుటచే నీతనితండ్రిపేరు తిరువేంగళార్యుఁ డైనట్లు తెలియుచున్నది. మరియు గ్రంథావతారికలో దాను "తిరువేంగళార్యకవిరాజసమాశ్రయ ధన్యచిత్తవర్తనుఁ" డనియు—

"అత్తిరువేంగళార్యుని యుదారదయావిలసత్కటాక్షసం
పత్తి నదీర్ణమైన సుకుమారవచఃప్రతిభానిరూఢి ను
ద్యత్తరగద్యపద్యచయ మాశుగతిన్ రచియింపనేర్చె"

ననియు వ్రాసికొనుటచే నీతని కవితాగురువు కూడ దిరువేంగళార్యుఁడైనట్లు కన్పట్టుచున్నది. ఈతిరువేంగళార్యు లిరువురు భిన్నపురుషులై యుందు రని తోచుచున్నది. అట్లు కానిచో గురువును వర్ణించునవసరమున నతఁడు తనతండ్రియే యని చెప్పకుండునా?

కవికాలమును నిర్ణయించుటకు దగినయాధారములు కొన్ని గ్రంథమునందే యున్నవి. వానిలో గృతిపతివంశావతారము ముఖ్యమైనది. ఈకృతిపతి యిప్పుడు కార్వేటినగరసంస్థాన మని వాడబడుచున్న దేశమున కధిపతి యైన వెల్లంటి కసవరాజు. ఆదేశమునకు దొండమండలము, తుండీరమండలము నని పూర్వనామములు. ఆంధ్రజైమినిభారతకృతిపతి యగుసాళువ నరసింగరాజు మొదలగు సాళువరాజులు పూర్వ మాదేశమును బాలించిరి. వారిపిదప మాకరాజువంశ్యులు రాజులైరి. ఈమాకరాజుకులములో జేరిన తిరుమలరాజునకే చదలువాడ మల్లయకవిప్రణీత మైన విప్రనారాయణచరిత్ర మంకిత మైనది. కొంతకాలమునకు రాజ్యము మాకరాజువంశమునుండి దౌహితృభాగముగా వెల్లంటివారికి సంక్రమించినది. ఈమా ర్పెప్పుడు జరిగినదో స్పష్టముగా దెలియదు. ప్రస్తుతగ్రంథకృతిపతి యైన కసవనృపతి యీవెల్లంటివంశమువాడే. ఇప్పుడున్న కార్వేటినగరపు జమీందారులు కూడ నీవంశమువారే. మాకరాజువారును