పుట:Chanpuramayanam018866mbp.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

చంపూరామాయణము


గాఁ బితృమేధంబు నిర్వర్తించి సవిధంబున సమేధమానవిషాదుం డై వర్తించువిభీషణు నశేషరాజ్యాధిపతిగా రఘుపతి యఖిలతీర్థాహృతంబు లగుతోయంబులఁ దోయదం బనలాకులం బగువనస్పతింబలె నభిషిక్తుం గావించె.

143


గీ.

అంత రాఘవచరితపట్టాభిషేక, సమధిగతరాజ్యుఁ డగు విభీషణుఁడు పొలిచె
ననుదినవివృద్ధమండలుం డగుచుఁ జండ, రుచిసుధాపూరణమునఁ జంద్రుండువోలె.

144


క.

సీత న్నిభృతవిభీషణ, నీత నృతులం దుదారనిర్మలశీల
ఖ్యాతం గనుఁగొని మనుకుల, నేతకు మది హర్షశోకన్బిడం బయ్యెన్.

145


సీత యగ్నిప్రవేశము

వ.

అనంతరం బరుంధతియుంబలె పవిత్రచారిత్రనిధి యన ధరిత్రీపుత్రి పతివ్రతాశిరోమణి యని తెలియంబడియును మర్త్యధర్ముం డైనపరమపురుషునకును లోకంబునకును బ్రత్యాయనంబునకై పురందరముఖు లగుబర్హిర్ముఖులును భగవంతుం డగునరవిందాసనుండును సాక్షులుగాఁ బునరుదయంబునకై వనరుహబంధునిం బ్రవేశించు నిందుకళయుంబలె సముజ్జ్వలజ్జ్వలనంనంబు బ్రవేశం బొనరించె.

146


గీ.

పూతచారిత్ర యయ్యును భూమిపుత్రి, నిజవిశుద్ధికినై హవ్యభుజునిఁ జొచ్చె
నతఁడు నపవిత్రవస్తుసంగతనిజాఘ, దమనుఁ డయ్యెను దత్ప్రవేశమునఁ జేసి.

147


క.

అనలానుషంగమునఁ బా,వనఁగా జానకి నెఱింగి వైభాతికవే
ళను భానుఁడు ప్రభనుంబలె, నినకులుఁడు పరిగ్రహించె నెల్లరు మెచ్చన్.

148


వ.

మఱియు దాశరథి యధిగతనిజప్రశంసావిధానుం డగువిధాతచేతఁ బ్రదర్శ్యమానుండును నారూఢవిమానుండును మహారథుండు నగుదశరథునకుం బ్రణమిల్లి తదీయశాసనంబు శిరసావహించి దురంబునఁ గాలధర్మంబు నొందినవానరోత్కరంబును బాకశాసనవరంబునం బ్రతికించి వారిచే ననుగమ్యమానుండును బ్రమోదమానమానసుండును సుగ్రీవునితోఁ గృతసంభాషణుండును నగుచు విభీషణుఁ గరుణారసంబుతో విలోకించుచు జానకీలక్ష్మణులతోడం గూడ నయోధ్యాప్రయాణాభిముఖుం డై కామచరంబును గౌబేరంబును నగువిమానం బధిరోహించె.

149


క.

మణిపుష్పకగతుఁ డై త,త్క్షణమున లంకోపకంఠదశకంఠరణాం
గణములు సింధువు సేతువు, నణుమధ్యకుఁ దెలిపికొనుచు నవ్విభుఁ డరిగెన్.

150