పుట:Chanpuramayanam018866mbp.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

చంపూరామాయణము


సీ.

అది యటులుండని మ్మవనికన్యామణి రఘువీరగృహిణి కర్హంబు లీదృ
శాచారమునకును సదృశంబు పంక్తిముఖాపరాధతక్రియ కనుగుణంబు
కులకాంతయీలువుకును ననుకూలంబు క్షత్రియాణ్యుక్తికి సముచితంబు
నగు నట్లు పలికితి వనుచుఁ బ్రశంసించి యంజనానందనుం డనియె మఱియు


గీ.

రామలక్మణు లీదైత్యరాజధానిఁ, జేరినా రని యెంచుమీ చిత్తమునను
రాఘవజ్ఞాతపూర్వకశ్లాఘనీయ, మగు నభిజ్ఞాన మిచ్చి న న్ననుపు మిపుడు.

70


హనుమంతునితో సీత ప్రత్యభిజ్ఞానంబు దెల్పుట

వ.

అనుటయు నజ్జనకరాజనందన నిట్టూర్పు నిగిడించి యి ట్లనియె నోయసాధారణమేధానిధానా! సావధానంబుగా నాకర్ణింపుము. మున్ను సమున్నతానేకమాణిక్యచాకచక్యప్రకటతటనిరాఘాటం బగుచిత్రకూటనికటంబున సముల్లసత్పల్లవాంతరసంఫుల్లకుసుమసందోహస్యందమాన మకరందధారాస్వాదనిర్భరానందతుందిలమిలిందబృంద ఝంకారహుంకారితసంక్రందనోద్యానవైభవం బగువనంబున, రఘునందనోపధానీకృతోత్సంగ యగు నాసముత్తుంగపయోధరపరిసరంబు ప్రఖరనఖరముఖవిదారితం బొనరించిన ధారాధరనామకాకంబు నైక్ష్వకుం డాలోకించి.

71


చ.

సమధికరోషయుక్తవిలసత్కుశరూపకుశేశయాసనా
స్త్రము వడి నేసె దుర్మదపురందరనందనవాయసంబు పై
దమితమదంబు నై యదియుఁ దత్కృపచేత హృతాక్షిమాత్ర మై
క్షమఁ జిరజీవి నాఁదనరుసంజ్ఞ వహించె యథార్థ మై తగన్.

72


క.

అని పూర్వకథాస్మరణం, బున ద్విగుణితదుర్ధశాసమున్నతి యై యి
త్తు నభిజ్ఞానాంతర మను, చును హనుమంతున కొసంగెఁ జూడామణియున్.

73


మ.

మతి నెంతేఁ బ్రమదంబు సంధిల మణిం బౌలస్త్యసంత్రాసపుం
జితయాగాగ్నిదశం గృశాంగి యగురాజీవాక్షి యీయం బ్రణ
మ్రతచేఁ గైకొని యంజనాతనయుఁడు న్మాణిక్యగర్భాసనాం
చితభోగిప్రతిమానబాహుఁ డగుచుం జెందెం బ్రయాణత్వరన్.

74


క.

కృతకృత్యుం డయ్యె విని, ర్గతుఁ డై తనరాక దశముఖజ్ఞాతము గా
మతిఁ దలఁచి పావని గుణా, ద్భుతుం డశోకవనభంగముం గావించెన్.

75


సీ.

తనదుకృత్యములచేఁదగు భూరిశాఖల కవనతిసంధాత యగుటవలన
మఱి సుమనఃకదంబకముల కెల్లను ముఖభంగ మొనరించి పొలుచువలన