పుట:Chandrika-Parinayamu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పై రెండభిప్రాయములవలన నీకావ్య మెంత ప్రౌఢతమమో స్పష్టమగుచున్నదికదా! కనుకనే కీ.శే. జటప్రోలు (కొల్లాపురం) సంస్థానాధిపతులగు శ్రీశ్రీ సురభి రాజా వేంకటలక్ష్మారావు బహదర్, రాజానవాజ్‌వంతుగారు, తమ యాస్థానపండితులగు అవధానం శేషశాస్త్రులు, వెల్లాల సదాశివశాస్త్రులవారిచేత తమయభీష్టానుసారముగా రచింపఁబడిన శరదాగమసమాఖ్యవ్యాఖ్యాసహితముగాఁ జంద్రికాపరిణయమును క్రీ.శ.1928లో రాజమహేంద్రవరం లలితాప్రెస్సునందు బ్ర.శ్రీ. చదలువాడ సుందరరామశాస్త్రులవారి పర్యవేక్షణమున ముద్రింపించిరి. అట్టి చంద్రికాపరిణయప్రతులు ప్రస్తుత మాసంస్థానమువారియొద్దనే యేకొన్నియో యున్నవి. అందఱికిని అందుబాటులో లేవు.

అందువలన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీవారు ఇట్టి యున్నతస్థాయికి జెందిన మహాకావ్యము బహుళవ్యాప్తినిఁ బొందవలయునన్నచో ప్రతులు మూలమాత్రములైనను సాహిత్యప్రియుల కరకమలములం దుండుట యావశ్యకమని యెంచి విపుల మగు పీఠికతోఁ గూడ దీని పునర్ముద్రణమునకుఁ బూనుకున్నారు. మూలమునందలి పద్యములను ఆధునికములగు విరామచిహ్నములతో నందించినచో వ్యాఖ్యానము లేకున్నను విజ్ఞులగువారు పద్యభావములను గ్రహింపఁగలరని యట్లు చేయఁబడినది. ఇంత కఠినకావ్యము నెవ్వ రర్థము చేసికొనఁగల రన్నది సరియైన ప్రశ్న కాదు. ఇంతకఠినమని తోఁచునట్లు పద్యములు వ్రాయఁగల కవి యున్నప్పు డాపద్యముల నర్థము చేసికొని యానందింపఁగల్గువారును లభింపఁగలరు. ఇంతకు ఉత్కృష్టభాషాపాండిత్యమర్యాదలు గల్గి సాహిత్యమంజూష లనఁదగిన మహాకావ్యములు లుప్తప్రాయములు గాకుండునట్లు వానిని పౌనఃపున్యముద్రణములచేత రసజ్ఞుల కందించుట సాహిత్యసంస్థలు చేయవలసినపని గదా! సరిగా సాహిత్య అకాడమీ అట్టి యపరిహార్యమగు విధినే నిర్వర్తించుచున్నది.

ఆధునికకాలమున వివిధసంస్కృతులతోను వివిధభాషలతోను సంబంధ మేర్పడియున్నప్పటికిని, కవితారచనలోని వివిధప్రక్రియలలో పద్యమున కున్న