పుట:Chandrika-Parinayamu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపోద్ఘాతము

(సువర్ణాక్షతలు)

కవుల ప్రతిభావ్యుత్పత్త్యభ్యాసములను బట్టియు, వారివారి యభిరుచులు, సంస్కారములు, స్వభావములను బట్టియు కావ్యములు సామాన్యముగాను, ప్రౌఢములుగాను, ప్రౌఢతమములుగాను రూపొందుచుండును. అవి చదువువారి యంతస్తులను బట్టి యర్థమగుటయు, ఆదరపాత్రము లగుటయు జరుగుచుండును. సుమతి, వేమన శతకములు మొదలుకొని ‘ఆముక్త మాల్యద, వసుచరిత్ర’ల వరకుఁగల కావ్యజాత మంతయు నిట్టి సోపానక్రమములోనే సహృదయుల యాదరమును బొందుచు నాంధ్రసరస్వతి కలంకారప్రాయమై యున్నది. అట్టివానిలో ప్రౌఢతమజాతికిఁ జెందినట్టిది యీ చంద్రికాపరిణయము. దీని యంతస్తును గురించి విద్వత్సార్వభౌములు, పండితకవులు నగు బ్ర॥ శ్రీ వేదము వేంకటరాయశాస్త్రులవారు ఈక్రిందివిధముగాఁ దమ యభిప్రాయము నొసఁగినారు.

“శ్రీమత్కొల్లాపురీ సంస్థానాధీశ్వరులలో ప్రాక్తనులైన శ్రీమాధవరాయనివారు రచించిన చంద్రికాపరిణయంబను ప్రాచీనగ్రంథమును ముద్రాక్షరాంకితముగాఁ గనునట్టి భాగ్యము నేఁటికొదవినది. వసుచరిత్రకన్న శ్లేషగాంభీర్యంబు గలిగి రసనిష్యందనంబున విజయవిలాసముం బురణించుచు కల్పనాప్రౌఢియందు ఆముక్తమాల్యదం దలఁపించుచు అటనట న్యాయవైశేషికాది శాస్త్రమర్యాదల ననుసంధించుచు నుండు నీయతిప్రౌఢప్రబంధము