పుట:Chandrika-Parinayamu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాశ్చర్యపడుచుండ నాగట్టురాపట్టి క్షణదోదయుని యెదుట సాక్షాత్కరించెను. రాజులందఱును లేచి నమస్కరించిరి. పాంచాలరాజు పార్వతికి నమస్కరించి సఖులకుఁ జంద్రికను దోడితెండని యానతిచ్చెను. రాజన్యులనెడు వనములకు వసంతమువలెను, నలువ నేర్పుచే నిర్మించిన మణిపుత్రికవలెను, క్షణదోదయుని సుకృతలక్ష్మివలెను ప్రకాశించుచు, దేహకాంతిచే నినుమడించిన మణిభూషణతేజస్సుగల చంద్రిక సఖీమధ్యగతయై స్వయంవరసభాస్థానమునకు వచ్చెను. ఆమెను జూచిన రాజన్యులు ఆమె మెఱుఁగుతీఁగయో, లక్ష్మియో, రతియో, యని భావించు చుండిరి. అట్లు వచ్చిన చంద్రిక తండ్రినిఁ జేరి, యతని యనుజ్ఞచేతఁ బార్వతికి నమస్కరింపఁగా నాహైమవతి “అభీష్టార్థసంసిద్ధి రస్తు” అని దీవించి, కౌఁగిలించుకొని, చంద్రికతలపైఁ గనకమంగళాక్షతల నుంచెను. పిమ్మట పల్లకిపైఁ జంద్రికను గూర్చుండ నియోగించి, తానొక సఖీరూపమును దాల్చి, ప్రక్కన నడచుచు మేరుశృంగములపైఁ గూర్చున్న సింగపుఁగొదమలఁ బోలి యున్న రాజకుమారులను సువర్ణమంచనికాయములపైఁ జూపి యుల్లేఖించుచు, వారివారి శౌర్యధైర్యగాంభీర్యాదిసద్గుణములను విశదపరచుచు నొక్కరొక్కరినిగా, పుష్కరద్వీపాధిపతిని, శాకద్వీపాధిపతిని, కుశద్వీపభూవరుని, శాల్మలిద్వీపనాయకుని, ప్లక్షద్వీపాధిపతిని, జంబూద్వీపభూపాలలోకంబునందు గౌడదేశాధీశుని, మథురానాయకుని, కాశీరాజును, కర్ణాటభూపతిని, అంగదేశపురాజును, కేరళమహీపతిని, దహళభూపాలును, భోటరాజును, సింధుదేశాధిపతిని, కుకురుదేశాధిపతిని జూపి వరింపుమనఁగా, జంద్రిక వారియెడ నౌదాసీన్యంబును, నలక్ష్యభావంబును, ననాసక్తిని వెల్లడింపఁగా గౌరి యాకనకగౌరిని ముందునకుఁ దీసికొని వెళ్ళి రాజసభామధ్యమున నక్షత్రనికరాంతర ద్యోతమానుండగు సుధాకరునిఁ బోలియున్న సుచంద్ర మనుజేంద్రునిఁ జూపి, తదీయచిత్త మాతనియం దనురక్తమైయుండుట నెఱింగి యిట్లనియె. “లలనా! రవిప్రభావిరాజమానుఁడగు ఈ విశాలారాజధానీప్రభువును సుచంద్రునిఁ జూడుము. నీకరాబ్జములందున్న ప్రసూనమాల యాతనివక్షస్థలముపై విష్ణువక్షము నందు వైజయంతీమాలవలెఁ బ్రకాశించునుగాక. ఈసుచంద్రధరణీపతి శాతశరములచేత రాక్షసరక్తము అర్ఘ్యముగాను, ఆదానవుల యేనుఁగుల తలలోని మణులు సుమాంజలిగాను, వారి యాత