పుట:Chandrika-Parinayamu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కట్టిన సమయమున చిత్రరేఖ యచ్చటికిఁ జేరి, వివిధభంగిమలతో తన చక్కదనమును మునిచిత్తమున కెక్క జేయుటకుఁ బ్రయత్నించెను. కాని, తాపసుని వైఖరి తఱుగలేదు. అప్పుడు సంగీతపాండితితో చిత్రరేఖ వీణ వాయించెను. విచిత్రగతులతో వాయించిన వీణావాదనము ఫలింపక పోగా, నద్భుతవైఖరులతో నాట్యము చేసెను. అట్లు హాటకకింకిణికాఝణంఝణధ్వనులు చెలరేఁగ నాట్యముఁ జేయుచు మునిపాదములకు నమస్కరించి, ‘నియమిచంద్ర! వేల్పుదొరలకు విరాళిని హెచ్చించు చక్కఁదనము గల దానను, చిత్రప్రతిమలకు జీవముఁబోయఁగల పాటను నేర్చినదానను, రంభాదులు మెచ్చు నాట్యము నెఱింగినదానను, హరిహరాదుల సభలలో నెన్నియో బిరుదము లందినదానను, నీవు సరస్వతివే యని బ్రహ్మ మెచ్చుకొను సాహిత్యవిద్యాపాటవము గలదానను, నాపేరు చిత్రరేఖ, నిన్ను సేవించుటకై వచ్చితి ననుగ్రహింపు’ మనెను. ఆపలుకులు విన్న మునిశ్రేష్ఠుఁడగువసంతుఁడు కనుఁగవను సగము విప్పి చిత్రరేఖను జూచి, మరల కన్నులు మోడ్చి, నిరవధికసమాధిలో నిమగ్నుఁడయ్యెను. అతని చిత్తగతి నెఱుఁగలేని చిత్రరేఖ సఖీజనసహితముగా మునిసమీపమునకుఁ జేరి, యుక్తి చాతుర్యమున ‘మునిచంద్రా! నిరుపయోగమగు నీ నివృత్తిమార్గమును గట్టిపెట్టి, జవరాలిగుబ్బలను జేరుట పర్వతసీమల నుండుటగాను, రత్యంతశ్రమజలమునఁ దోఁగుట గంగావగాహనముగాను, యధరపానము నమృతపానముగాను, నారీరతికూజితములు పలుకుట నుపనిషత్పఠనముగాను దలఁచి, కుసుమాయుధదైవత మిచ్చు నఖండానందము ననుభవింపుము’. అని పెక్కువిధముల రత్యుద్దీపక ప్రసంగములు చేసి, మౌననిమగ్నుఁడై యున్న ముని యంగీకరించినట్లు భావించి, యేమివచ్చిన వచ్చుఁగాక యన్న ధైర్యముతో నతని చేతిని బట్టుకొని తనకళాస్థానముల నుంచుచుఁ జలింపఁజేసెను. ఆచలనమువలనఁ గన్నులు విప్పి క్రోధారుణవీక్షణములతో చిత్రరేఖనుజూచుచు, తోఁకఁ ద్రొక్కినపామువలె బుసకొట్టుచు, ‘ఓ నిలింపచాంపేయగంధీ! మన్మథమదాంధకారముచేఁ గన్నుగానక వనములందుఁ దపంబుచే దినములు గడపుచున్న నన్నుఁ దెచ్చుకోలువలపునఁ జేయిబట్టి రతులకు రమ్మని పిలుతువే? ఈయపరాధమునకు ఫలితముగా నీదేవాంగనాభావంబుఁ దొలంగి మానవవనితవై పుట్టి ‘సుదోషాకర’సమాఖ్యుఁడగు నొక యిరాపుని బెండ్లియాడి యుండెదవుగాక’ యని శపించెను.