పుట:Chandrika-Parinayamu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రహ్మ, చట్టుకూఁతు ననఁగా నొక వివేకశూన్యురాలిని సర్వజ్ఞుఁడగు శంకరునికిఁ గూర్చిన తన వక్రరచనను, ఖరపాదుని ననఁగా గాడిదకాళ్లుగలవానిని (ఖరపాదుఁడనఁగా తీక్ష్ణకిరణములు గల్గిన సూర్యుఁడని శ్లేషార్థము) పద్మినితోఁ గూర్చిన విపరీత సృష్టిని, కుముద్వతిని, సంతోషమే యెఱుఁగని యొక స్త్రీని, సత్పతితో, ననఁగా మంచిభర్తతోఁ దార్చిన ప్రదోషసృష్టిని, సర్వాంగములును బంగారపుఛాయతో నున్న లక్ష్మిని చిరపూరుషుని కనఁగా నొక ముదుసలివానికిఁ గూర్చిన యతుల్యసర్గమును, ఈ తనతప్పుల నన్నింటిని లోకము మఱచునట్లు, ధీచాకచక్యము, అసమానరూపము, ఆనుకూల్యము, అనురూపయౌవనము గలి గిన చంద్రికాసుచంద్రదంపతులను జతఁ గూర్చి కీర్తిగాంచె నను వర్ణన గల యీక్రిందిపద్య మత్యంతమనోహరముగా నున్నది.

సీ॥ చట్టుకూఁతు నొకర్తు సర్వజ్ఞుఁడగు మహే
శ్వరునితోఁ దార్చిన వామరచన,
ఖరపాదు రసవదంతర యైన పద్మిని
తోన గూర్చిన పవలైన చెయ్వు,
లల కుముద్వతి మనోహారియౌ సత్పతి
తో ఘటించిన యా ప్రదోషసృష్టి,
చిరపూరుషుని వసుస్ఫురితాంగియగు లక్ష్మి
తో నెనయించు నతుల్యసర్గ,

తే॥ మన్నియు జగంబు మఱవ నయ్యబ్జజన్ముఁ
డతుల ధీ చాకచక్యబు, నసమరూప,
మానుకూల్యంబు, ననురూపయౌవనంబు,
నమర నిద్దంపతులఁ జేసె ననఘశక్తి.

ఇట్లు వివిధవర్ణనలలోఁ దన భావకల్పన, పదరచన, సమాసగ్రథన, శ్లేషాద్యలంకారరచనాసామర్థ్యమును, తర్కవ్యాకరణ వేదాంత జ్యోతిషాదిశాస్త్రపరిశ్రమను, సంగీతకామశాస్త్ర నాట్యకళాకోవిదత్వమును, గీర్వాణాంధ్రభాషావైదుష్యమును, వైదికసంప్రదాయములను, లోక