పుట:Chandrika-Parinayamu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పర్వఁగా సుచంద్రుని హృదయమందుండు మదనాగ్నిజ్వాల నిలువలేక వెలువడినదో యనునట్లు ప్రకాశించెనట. మఱియు నాపూలదండ సగము ప్రతిఫలించినదై, సుచంద్రుని హృదయమందు కలఁతఁ బెట్టు మదనబాణములను వెలికిఁ దీసికొని రాఁగలనని యతని హృదయమందుఁ జొరఁబడినదా యన్నట్లు ప్రకాశించెనట. సుచంద్రుని కంఠమున నతని దేహకాంతిచే నెఱ్ఱబడిన యాదండ సంపెంగపూలదండ యని భయపడి తుమ్మెదలు పాఱిపోవుచుండఁగా నవి మన్మథుని కింక నీవు సుచంద్రునిఁ బొడువఁ బనిలేదు, అతనిని చంద్రిక వరించినదని చెప్పుటకు వెళ్లుచున్నట్లుండెనట. నాయకుని కంఠమునందు నాయిక వైచినహారము, పద్మరాగమణివ్యాప్తమై యచ్చట చంద్రికారాగలక్ష్మి చేరి యతనిని గౌఁగిలింపఁగా నా రాగేందిర బాహులతాయుగ్మమా యనునట్లుండెనట. ఆ వరమాలకాంతి కతఁడు ధరించిన యితరమాలలు నిస్తేజస్కములై యుండెనట. ఇట్లు స్వయంవరమాల నత్యధికముగా నుత్ప్రేక్షించి చెప్పెను.

సుచంద్రునిఁ బెండ్లికొడుకును జేయుటకు ముందభ్యంగనముఁ జేయునప్పు డొకచెలి యతనికిఁ దలయంటెను. ఆ శిర సంటుటలో నాయువతి వంపుసొంపు లెట్లుండెనో కనులకు గట్టినట్లీక్రిందిపద్యమున వర్ణించెను.

సీ॥ అఱచందమామపై కుఱుకు చీఁకటిపిల్ల
లన, ఫాలతటిఁ గుంతలాళి జాఱ,
మదిపేరి మరుమేడఁ బొదలు ధూపము పర్వు
పోల్కిఁ, గ్రొందావియూర్పులు జనింప,
నననూఁగువేడ్కఁ జేకొని మ్రోయు తేఁటిచాల్
సరి, నీలవలయముల్ చాల మొరయ,
లవలియాకులఁ గ్రమ్ము నవహైమకణముల
గతిఁ, జెక్కుల శ్రమాంబుకణిక లుబ్బ,

తే॥ సరులు నటియింప, నునుఁగౌను సంచలింప,
గుబ్బకవ రాయిడింప, సకుల్ నుతింప,
చూపు నెఱమించు మించు మేల్సొగసు నింప,
నమ్మహీపాలు శిరసంటెఁ గొమ్మ యొకతె.