పుట:Chandrika-Parinayamu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెఱవ కెమ్మోవిక్రొందేనియ ల్గ్రోలుట
నిరుపమామృతపానసరణి గాఁగ
కొమ్మతో రతికూజితమ్ములు నొడువుట
సరసాగమాంతాళి చదువు గాఁగఁ

తే॥ దలఁప బద్మాంబకాభిఖ్యదైవతంబు
మసలక దయారసంబున నొసఁగు సుమ్మ
ఖండితానందగరిమ నిక్కలన మనుము
వట్టి యీఖేదకనివృత్తి గట్టి మౌని.

ఇది చిత్రరేఖ వసంతముని తపోభంగమును జేయుటకై చేసిన యుపదేశము. నివృత్తిమార్గమునుండి ప్రవృత్తిమార్గమునకు మార్చుకొని, పద్మబాణుఁడగు మన్మథదైవము నారాధించుటయే నీకు అఖండానందప్రదమగునని బోధ. పర్వతాదులకు బదులు జవరాలిగుబ్బలు మొదలగువానిని సేవించి ధన్యుఁడవు గమ్మన్నది. ఇది వరూథినీప్రవరుల వాదమును స్ఫురింపఁజేయుచు నంతకన్న విపులముగా వర్ణింపఁబడియున్నది. ఇంతకన్నను శ్లేషచమత్కారముతో మునిని సంబోధించి పలికిన రెండవ యాశ్వాసములోని 104, 105, 106, 107,108 సంఖ్యగల పద్యములలో కవి యసాధారణశక్తిని గనఁబరచినాడు.

తరుణిమొగంబె తానని సుధానిధి విష్ణుపదమ్ము ముట్టి దు
ష్కరకరజాతపాండిమ విగర్హితుఁడై యశుచిం గృశింపఁ, బం
కరుహము తన్ముఖోపమము గానని తా హరిపాదమంటి యిం
దిర దనుఁజేరఁ గీర్తిఁ గని దీపితజీవన మయ్యె నెంతయున్.

ఇది చంద్రికాముఖవర్ణనము. చంద్రుఁడు, కమలము నను నీరెండు సమానవస్తువులలోఁ జంద్రుఁడు గర్వముచేత నేనే చంద్రిక ముఖము నని విష్ణుపాదమును బట్టి బాస చేసెను. పంకరుహము నేను చంద్రిక మొగమునకు సాటికాఁజాలనని హరిపాదము పట్టి వచించెను. చంద్రుఁ డబద్ధమాడి బాస చేసినందున దుష్కరకరజాతపాండిమవిగర్హితుఁ డయ్యెను. అనఁగా చికిత్సకు లొంగని చేతియందలి పాండురోగముచేత దూషితుఁడయ్యెను. కమలము