పుట:Chandrika-Parinayamu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రహస్యప్రదేశమును (కోనను) జూచెనని భావము. తెలుఁగుపదము లెక్కువగా నుండి సమాంతరపాదములు లేని సీసపద్యమిది.

చ. పగడపుఁగంబముల్, తళుకుఁబచ్చల బోదెలు, కెంపుదూలముల్,
జగమఱాల దెంచికలు, చక్కనినీలపుఁ బల్కచాల్, మెఱుం
గగు తెలిమిన్నలోవయును, నచ్చపుబంగరుపేరరంగునన్
దగఁ గనుపట్టు నొక్క వికసన్మణిమండప, మప్డు దోఁపఁగన్.

‘సమృద్ధిమద్వస్తువర్ణ ముదాత్తః’ అను లక్షణముగల ఉదాత్తాలంకారవర్ణనమే యైనను ఇది యాకాలపు గృహనిర్మాణపద్ధతిని వివరించుచున్నది. లోవ యనఁగా చూరు. కేవలమణిమండపమని చెప్పక దాని యవయవము లెట్టు లాయామణివిశేషనిర్మితములో చెప్పుట చమత్కారము.

మ. అలసత్యాధ్వము డిగ్గి, యప్డు తప మొయ్యన్ దాఁటి, దీవ్యజ్జన
స్థల మాపిమ్మట నొంది, యంతట మహస్థానంబునుం బొంది, వే
ల్పులరావీడట వేడ్క డగ్గఱి, భువర్లోకేంద్ర మవ్వేళఁ జే
రి, లలిం గంజశరుండు దా దొరసె ధాత్రిన్ మేరుమార్గంబునన్.

బ్రహ్మదేవుని యాజ్ఞచేత వసంతముని తపోభంగముఁ జేయఁదలఁచిన మన్మథుఁ డాముని తపమాచరించుచున్న భూలోకము నందలి పారిజాతవనమునకు, సత్యలోకమునుండి వచ్చుమార్గము మేరుపర్వతమార్గమే యనియు, నా మార్గమున సత్యలోక, తపోలోక, జనర్లోక, మహర్లోక, స్వర్లోక, భువర్లోకములను గ్రమముగా దిగి, భూమిపైకి వచ్చెనని తెలుపు నీపద్యము మాధవరాయల పౌరాణికభూగోళవిజ్ఞానమును వెల్లడించుచున్నది. చక్కనిధారగల పద్యము.

సీ॥ జవరాలి నునుగుబ్బచన్నులఁ జేరుట
వసుధాధరస్థలీవసతి గాఁగ
నతివ రత్యంతశ్రమాంబులఁ దోఁగుట
నమరాపగావగాహనము గాఁగ