పుట:Chandrika-Parinayamu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

‘విశ’ధాతువు పరస్మైపదియే యైనను, ‘నేర్విశః’ అను సూత్రముచేత ‘ని’ అను నుపసర్గతోఁగూడి నప్పు డాత్మనేపదిగా మారును. అట్టి యాత్మనేపదిత్వమును బొందిన ‘విశ’ధాతువునకు, వర్తమానమును బోధించు ‘శానచ్’ప్రత్యయమును జేర్పఁగా ‘నివిశమాన’ అను పదము సిద్ధించును. ప్రవేశించుచున్న యని దాని యర్థము.

మ॥ వరసామ్యంబు ఘటిల్లెనంచు నృపతుల్ వర్ణింప రాజాధిరా
జు, రవిద్యోతనరూపతేజు, నితనిన్ సోమాస్య! యుద్వాహమై,
నిరతం బొప్పుము సర్వభూప హరిణీనేత్రా శిరోరత్న ది
వ్యరుచుల్ త్వత్పదవీథి యావకరసాన్వాదేశముం బూనఁగన్.

(ఆశ్వా 5. ప.88)

ఓచంద్రికా! నీవీకర్ణాటభూపతిని వరించితివేని సర్వభూప ప్రియాంగనాశిరోరత్నకాంతులు నీపాదప్రదేశమునందు ‘యావక రసాన్వాదేశమున్’ లాక్షారసమునకు పౌనరుక్త్యమును బొందును. మొదట లాక్షారసముఁ బూసిన పాదములపైఁబడి, యా రత్నకాంతులు,మరల నట్టికాంతినే పాదములకుం జేకూర్చునని భావము. ‘అన్వాదేశ’శబ్దము వైయాకరణసంకేతము. ‘కించి త్కార్యం విధాతుం ఉపాత్తస్య కార్యాంతరవిధానాయ పునరుపాదాన మన్వాదేశః’ ఒకకార్యమును విధించినదానినే మరల గార్యాంతరమును విధించుటకై గ్రహించుట ‘అన్వాదేశ’మని దాని వివరణము. అనఁగాఁ బౌనరుక్త్యమని తాత్పర్యము. ఈ ప్రయోగ మీకవియొక్క వైయాకరణసంప్రదాయవేదిత్వమును దెలుపును.

అష్టదిక్పతుల భార్యలను జెప్పునప్పు డుపయోగించిన మఘోని, అగ్నాయి, అంతకీ, తమీచరాబల, వరుణా, మారుత వధూ, ఐలబిలీ, గిరికన్యా శబ్దము లీతనికిఁ గల వ్యాకరణజ్ఞతను జాటును. ఇఁక నాయకుఁడగు సుచంద్రుఁడు పెండ్లికొడుకై పాంచాలభూపాలుని మందిరమును బ్రవేశించు మహోత్సవమున జరుగు తత్తద్విశేషముల యతిశయమును బోధించుటకై, యతిశయార్థద్యోతకములగు నాయా యఙ్లుగంతధాతువులపైఁ గూర్చిన శానచ్ ప్రత్యయాంతములగు జరీజృభ్యమాణ , వరీవృత్యమాన,