పుట:Chandrika-Parinayamu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భావములు సంస్కారవిశేషములచేతఁ గవియగువాని చిత్తమున నెలకొని మఱల బయల్పడుట సహజము. అతఁడు వలయునని తెచ్చుకొనఁడు. వానియంతట నవియే యట్లు దొరలుచుండును. కనుకఁ జంద్రికాపరిణయకర్త భావదారిద్ర్యముచేతఁ గాని, భాషాదారిద్ర్యముచేతఁగాని అట్లు పోలికలు తెచ్చుకొన్నవాఁడు కాడు. అది యంతయు నతనికిఁ గల సంస్కారబలముచేత కాకతాళీయముగా జరిగినదే. అసలు సమర్థుఁడగు నేకవియు నొకని రచనాపద్ధతి నెరవు తెచ్చుకొనుటకు సిద్ధపడఁడు. అట్టి పరిస్థితిలో నుద్దండకవిప్రకాండుఁడగు మాధవరాయకవీంద్రునిఁగూర్చి సాహితీవిమర్శకులు సంశయింప నవసరము లేదు.

తే॥ విబుధశిక్షితుఁడవు, శాస్త్రవిదుఁడ, వఖిల
కావ్యవేదివి, ఘనతార్కికవ్యవహృతి
నెఱుఁగుదువు, నీ కసాధ్యమే యింపుమీఱఁ
గృతి వినిర్మింపు మాధవక్షితిప యనిరి.

ఇది సురభిమాధవరాయల యాస్థానమునందున్న పండితమండలి యతనినిఁ జంద్రికాపరిణయరచనకు ప్రోత్సహించిన వాక్యము. ‘కావ్యజ్ఞ శిక్షయాభ్యాసః’ అను లాక్షణికవచనానుసారముగాఁ గవియగువాఁడు చక్కని విద్యాభ్యాసమును విబుధులవద్దఁ జేయవలయును గనుక యితఁడట్లు చేసినట్టివాఁడు. ‘శాస్త్రవిదుఁడవు’ అనుపలుకు మాధవరాయని ఛందోవ్యాకరణాలంకారజ్యోతిషసంగీతాదిశాస్త్రముల పరిశ్రమను దెలుపుచున్నది. ‘అఖిలకావ్యవేదివి’ ఇది కవియగువానికి మిక్కిలి యా వశ్యకము. ‘ఘనతార్కికవ్యవహృతి నెఱుఁగుదువు’ తర్కశాస్త్రవ్యవహారము నంతటిని యెరిఁగినవాఁడనుట. ‘కాణాదం పాణి నీయంచ సర్వశాస్త్రోపకారకమ్’ అనియు, ‘వాణీ తర్కరసోజ్జ్వలా’ అనియు విద్వాంసులచేతఁ గొనియాడఁబడుచున్న తర్కశాస్త్రమునందు సైత మీకవికి బ్రవేశమున్నచో నిఁక యతని రచనాశక్తిని గురించి వేరుగాఁ జెప్పనక్కరలేదు. ఇట్లు మహాపండితుఁడై, మహాకవియై విరాజిల్లిన విద్వత్కవి శ్రీసురభిమాధవరాయలు కనుక నతఁ డొకరి రచనాపద్ధతి నవలంబించు ననుమాటయే పుట్టదు. పైపద్యమునందుఁ బొందుపరచిన యతనిగుణములలో నొక్కొకదానిని స్థాలీపులాకన్యాయమునఁ జూతముగాక.