పుట:Chandrika-Parinayamu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ॥ అభిరామ నవపల్లవారామ కుంజవాటికలఁ గీరముల నాడించికొనుచుఁ,
బద్మాలయోదర ప్రౌఢసారసవీథి నంచలవేడంబు లరసికొనుచు,
గాంగేయధామ శృంగవిటంకముల నీలకంధరోజ్జ్వలగతు ల్గాంచికొనుచు,
విమలసింధుద్వీపవేదిక నరుణాప్తఖగవిహారప్రౌఢిఁ బొగడికొనుచు,

తే॥ రతియుఁ జేతోభవుండు, భారతియు నజుఁడు,
శచియు నమరాధినాథుండు, జలధిసుతయు
నబ్జనాభుండు, నన మించి యఖిలసమయ
సముచితక్రీడ సల్పిరి సతియుఁ బతియు.

(వసుచరిత్ర ఆశ్వా. 6 పద్య.97)

ఇట్లు చంద్రికాపరిణయ వసుచరిత్రములలో పెక్కుపద్యములు ఆదినుండి యంతమువఱకు నొకదాని నొకటి పోలియున్నవి. నాయకాలంబనములగు వీరశృంగారరసములయందును, నాయికాశ్రయమగు సంగీతకళయందును, మధ్యవర్తులగు నితర పాత్రలు నాయికానాయకులకుఁ బరస్పరానురాగముల నుద్దీపింపఁ జేయుటయందును, విప్రలంభశృంగారమున జరుగు నుద్యానవిహార జలక్రీడాదులయందును, వివాహవిధానమంగళకార్యములందును, నాయికానాయకసంభోగమునందును బెక్కుపోలిక లుండుటచేత కవులగు సురభిమాధవరాయ రామరాజభూషణులకుఁ బరస్పరసమాగమములు గాని, యొకరి రచనావిశేషముల నొకరు తిలకించియుండుటగాని జరిగియుండునని దృఢముగా విశ్వసించుటకు వీలగుచున్నది. ఇద్దరును శ్రీకృష్ణదేవరాయల మేనల్లుఁడగు నళియరామరాయలతో సన్నిహితసంబంధము గలిగియున్నట్లు చరిత్రకారులు భావించి నందున యిట్లు తలంపవలసి వచ్చినది. అయినప్పటికి వీరిద్దరిలో నొకరు ఎక్కువయనిగాని, యొకరు తక్కువయనిగాని, ఒక్క డుత్తమర్ణుఁడు నొక్కఁ డధమర్ణుఁడనిగాని నిర్ణయించుకొని తారతమ్యమును జెప్పుట సాహసమగును. మాధవరాయలు చాల ఘటికుఁడు. వసుచరిత్ర పోలికలతోఁబాటు పూర్వకవులగు కాళిదాస, కవిత్రయ, కృష్ణదేవరాయ, పెద్దనాదుల రచనలను బోలిన పద్యములు సైత మిందులో నున్నవి. పూర్వపూర్వ