పుట:Chandrika-Parinayamu.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నంబుజారిబింబసత్వం బైనఁ గనుంగొనుదుము గాక యని చయ్యన నెగసి యగణిత పారలోకసంఘ సంఘర్షణోత్పతద్భుజాంగదమణిచూర్ణపరంపర నిండారఁ గప్పిన నచ్చటం జూడనోపమి సంజాతమూర్ఛామహత్త్వంబున గ్రక్కునం ద్రెళ్లు నీలోత్పలకులంబుచెలువున వలుఁదకంబంబుల పయి నుండి జల్లున రాలు నీలోత్పలబాణకులంబులం గని యలరుచు, సుకరభ్రమరకప్రకరభాగ్యంబును, సురు చిరకైరవదళలోచనసమ్మదకృత్స్వరూపవైఖర్యంబును, సుందరకింజల్కమాంజుల్యంబును, శోభిల్ల నుల్ల సిల్లు సల్లకీపల్లవాధరామతల్లికల సరసకళాపాళికా రోచమాన కువలయేశసేవామనోరథంబున నేతెంచిన కుముదలతికలంగాఁ దలఁచి నభోంతరవావస్యమాన మరున్మానవతీపాతితసంతానలతాంత జాగళ్యమాన మరందబిందుసందోహకుహనా మహితహిమపృషద్వర్షంబుల కెట్టు లోర్చునని తన్మైత్రీగౌరవంబున నీడఁ జేరిన చంద్రాతపమండలంబు బెడంగునఁ గురంగలోచనామణులపై నెత్తిన యుల్లాభంబుపై దృష్టి వెల్లివిరియించుచు, నభంగుర మార్దంగిక మృదంగ ధిమిర్ధిమిధ్వానంబులు నతివేలతాళిక తాళనిస్వానంబులు ననూనవాంశిక వంశికానేకరాగతానంబులు నసమానగాయకమానంబులు నతిశయిల్ల నాత్మీయ తాండవవిలాస ప్రతిమాన భావభావనా నరీనృత్యమాన సురమీనలోచనా జనంబుల మీఁదికిం గుప్పించి తిరస్కరించి మరలం జేరుతీరున లాఁగులు వైచుచుం బఱతెంచు బిరుదుపాత్రల నేత్రంబు నానుచు, నసదృశంబును, నవాఙ్మనసగోచరంబును, నత్యద్భుతంబును, నభూతపూర్వంబును, ననితరలభ్యంబును నగు వైభవంబునఁ బాంచాలభూపాలమందిరంబు చేరం జనుసమయంబున. 48

శా. ఛద్మాన్యాంకురితత్రపాభరయుతేక్షారీతి నాలేఖరా
ట్పద్మిం జక్కఁగ నెక్కి వచ్చుధరణీభర్తం గనం దత్పురీ
పద్మాస్యామణు లెల్ల సమ్మదము లొప్పం జేరి రంచు న్శిర
స్సద్మౌఘంబుల నూపురార్భటిక లోజం జాటె వేగస్థితిన్. 49