పుట:Chandrika-Parinayamu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉ॥ సురభికులామలాబ్ధిఁ బొడచూపిన ‘మాధవరాయ’చంద్రుఁడా
సరసపదార్థరంజనము సత్కవిహృద్యము గాఁగ ‘చంద్రికా
పరిణయమున్’ రచించె, నది భావ్యము; నీవసుచర్య చూడఁగాఁ
బరగె నిగూఢవృత్తి నటు నీకును వర్తిలె ‘మూర్తి’నామమున్.

ఇది యొక విచిత్రమైన చాటువు. కీ.శే.వెల్లాల సదాశివశాస్త్రిగారు రచించిన సురభివారి వంశచరిత్రలో నుదాహరింపఁబడిన పద్యమిది. దీనిని రచించిన కవి యెవరో తెలియదు. కాని, యావిద్వత్కవి మాధవరాయల యాశ్రితుఁడై భట్టుమూర్తిపై ననాదరముగలవాఁడై యుండినట్లు ఈపద్యము సూచించుచున్నది. ‘చంద్రికాపరిణయము’ సరసపదములచేతను, సరసములైన యర్థములచేతను రంజకముగా నుండి సత్కవులకు హృదయంగమముగా నున్నదనియు, అది భావ్య మనియు, మాధవరాయల కవిత్వమును బొగడుటయు, వసుచరిత్ర నిగూఢార్థములు గలిగి, భావ్యముగా లేదని తెగడుటయు, నితని యభిప్రాయమై యున్నది. అంతియేకాక వసుచరిత్రను రచించినందువలన నీకు ‘మూర్తి’ యనుపేరు సార్థకమైన దనియుఁ, దృణీకారమున బల్కుట చూడఁగాఁ, ‘జంద్రికాపరిణయ’మను శ్లేషయమకాది సర్వాలంకారశోభితమగు మహాకావ్య మొకటి యుండఁగా నీ ‘వసుచరిత్ర’ యెందులకోయి? యన్న యధిక్షేపము సైతము గోచరించుచున్నది. ‘మూర్తిః కాఠిన్య కాయయోః’ యను నమరవచనమువలన ‘మూర్తి’ యనఁగా కఠినుఁడు, బండ యను నర్థము వచ్చుటవలన ‘నీ వసుచర్య చూడఁగా బరగె నిగూఢవృత్తి, నటు నీకును వర్తిలె మూర్తినామమున్’ అని యనుటలో ‘నీ వసుచరిత్ర యెవ్వరికిని అర్థము కాదు, నీవు వట్టి బండవు’ అన్న భావ మీపద్యరచయిత హృద్గతమై యున్నట్లు తోచెడిని. ఈపద్యరచయిత భావ మేదయినను, సంస్కృతాంధ్రసాహిత్యమర్యాద లెఱింగినవారు కేవలమూలములను మాత్రము చదివి చూచినచో నితనిపద్యమునందలి యభిప్రాయముయొక్క సత్యాసత్యములు బోధపడగలవు. వ్యాఖ్యానములను జూచినచోఁ దారతమ్యము తెలియుట కష్టము. ఇంతకు సురభిమాధవరాయలును రామరాజభూషణుఁడును సమకాలికులై యుండిరనుట పరమసత్యము.