పుట:Chandrika-Parinayamu.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యమలమౌక్తికదామంబులు దాల్చి కపురంపుబొట్టులు దీర్చి కమనీయమల యజకర్దమం బలంది కలికి తెలిచలువ లూని వెన్నెలం దలవరులు గనకుండ సంకేతనికేతంబులకుఁ బోవు త్రోవం బొంచి కమలకలికాసంలగ్నమధుపనినాదవలయ ఘీంకారసంకలితమృణాళయష్టికరం బూని యడ్డమ్ము పఱతెంచువా రెవ్వ రెవ్వరనఁ దలంగు మనంబున ఘట్టకుటికం బ్రభాతంబగు దారియయ్యె నని మాఱు వలుక నేరక మూలమూలల నొదుఁగుచుఁ దలంకునెడఁ గిలకిల నవ్వుచుఁ దమ్మెఱుఁగఁ జేయ నొక్కింత చిగిరించు నలుక నభిసారికా జనంబులు ప్రియులపై రువ్వు మవ్వంపు విరిగుత్తులం జివ్వకుఁ బిలుచుచు, వన్నె గల వెన్నెలబయిట నెన్నరానివేడుక పన్నిదంబులు వన్ని సుహృన్నికరంబులతోఁ బెన్నేర్పున జూదంబు లాడుచున్నకతం బునఁ గొంతదడ వగుటఁ బటుతరమహానట మనస్తట నానటద్ధైర్య విపాటనాటోప సముత్కట శంబరప్రతిభట కృపీటజకోరక శరపటలధారా దోధూయమాన మానసంబుతో విచ్చలవిడిం బెచ్చుపెరుఁగుతాపంబున వెచ్చనూర్చుచు నెమ్మదిం గ్రచ్చుకొని హెచ్చుమోహంబున నెచ్చెలిచేతికి నచ్చంపుగుఱుతిచ్చి మచ్చికల వల్లభుం దోడ్కొని రమ్మంచు నంచి యంచిత బహిరంగణ ప్రదేశంబుల నిలిచి పతిరాక కెదురుచూచునదియును నెయ్యంపుఁబొదలతూఁగుటుయ్యెలపై నొయ్యారం బునం గూర్చుండి ప్రియుండు పసిండిదండియ బూని సుతి మీట విభునిచెంత వసియించి చిన్నికిన్నెరం బూని పంచశరదేవతా విజయప్రపంచసమంచితంబు లగు నూతనగీతంబులు పలికించి చెలులఁ జొక్కించు నదియు నడుగు లొరయం గొనసాగ నల్లిన జడకుఁ జుట్టిన మొల్లవిరితావి యెల్లెడలకుం బరవ మంజుల చరణకంజ సంజిత కంజరాగ మంజీర శింజా రవంబులు కర్ణగ్లాని మాన్ప నొఱ దొఱపిన వలదొరపరు వంపుఁగైదువుతెఱఁగున నిండార దువ్వలువ గప్పి కాంతునిశాంతంబునకుఁ బోటులవెంటం జనునదియును దనమనం బలరఁ గలసి కళలఁ దేలించి మేలుంచి యేలిననాయకునియెడ నెడయని ప్రియమ్మునఁ దఱిసి విరిసరులు దుఱిమి చలువ వెదచల్లుకలపం బలఁది యంతంతం బొడము మోహమ్ముల నలమి కెమ్మోవి నొక్కి పునారతులకు వేడుక రేఁచి పైకొనునదియును నై