పుట:Chandrika-Parinayamu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. ఘనగజదర్పభేదన మఖండసురారిపురప్రభంజనం
బు నలఘుధర్మఖండనముఁ బూనిచి వేలుపు లెంచ నుగ్రవ
ర్తనఁ దనరారు నమ్మనుజరాజకలంబము చిత్రవైఖరిన్
దనిపె నజాత్మజాంతర ముదారతరప్రమదోర్మి నయ్యనిన్. 115

ఉ. ఆది గుణచ్యుతిన్ గనినయట్టినృపాలు నజిహ్మగాళి త
న్మేదినిలోన సుజ్జ్వలనమిత్త్రపరంపరఁ గ్రోలి వేగ మెం
తేఁ దనరన్ బళీ యసురనేతృకులంబు తదేకయుక్తిఁ ద
చ్ఛ్రీ దయివాఱె నొక్కొ యజరీవృతి నాకపదంబుఁ జేరఁగన్. 116

మ. నరవర్యాశుగకృత్తతద్దనుజసైన్యం బప్డు చూపట్టె దు
స్తరఝంఝానిలధూతదావగతి భ్రశ్యత్కాంచనస్యందనో
త్కరమై, నశ్యదనేకవాజివరజాతంబై, పతన్మౌళియై,
పరిశీర్యద్ఘనకుంభ్యనీకమయి, భూభాగంబు దాఁ గప్పుచున్. 117

మ. బలుపాదంబులు కూర్మముల్, మెఱుఁగు దోఁప న్మించు నేజల్ జలా
హులునుం, దెల్లనిచాయపట్టుగొడుగుల్ ప్రోద్ధూతడిండీరకం
బులు, చిక్కుల్వడు కేశపాశనికరంబుల్ నాఁచులుం గాఁగ ద
త్పలభుగ్గాత్రజరక్తనిర్ఝరిణి గన్పట్టెన్ శరోత్కర్షతన్. 118

సీ. భూరిదైత్యకపాలపూర్ణరక్తముపేరి
కాశ్మీరపంకంబు కలయఁ బూసి,
రథములజాళువారావిఱేకులపేరి
పసిఁడిబొట్టులు ఫాలపదవిఁ దీర్చి,
మహిఁ ద్రెళ్లి యున్న రమ్యశిరస్త్రములపేరి
కులుకుకుళ్లాయి తాఁ దల దవిల్చి,
యసృగంబుసిక్తధ్వజాంబరంబులపేరి
బలుచంద్రకావిదుప్పటులు గప్పి,