పుట:Chandrika-Parinayamu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. అపుడు మహోగ్రవర్తన భటాగ్రణిఁ బోరె భటాగ్రయాయి, హ
స్తిపకవరేణ్యుతో రణముఁ జేకొనె హస్తిపకేశ్వరుండు, సా
దిపటలిఁ జయ్యనం గదిసె ధీరత సాదిచయంబు, దోర్బలై
కపటిమచేఁ బరస్పరజిఘాంస మనంబుల నంకురింపఁగన్. 109

మ. ద్రుఘణంబుల్ పరఁగించి, కుంతములచేఁ దూలించి, కోదండము
క్తఘనాస్త్రాళులఁ గ్రమ్మి శూలతతి వేగన్ గ్రుమ్మి, దుర్వారపా
రిఘధారాగతిఁ జీరి, సంగరధరిత్రిన్ మించెఁ దద్వీరసే
న, ఘనాధ్వంబు పగుల్పఁ దత్తుముల సన్నాదంబు చిత్రంబుగన్. 110

మ. నరనాథేంద్రభటుల్ సురారిభటులున్ స్వస్వాభిధాశౌర్యముల్
వరుసం దెల్పుచుఁ బోరి రుగ్రరణఖేలాపాండితిన్ నిర్జరో
త్కరముల్ వ్యోమవితర్దిఁ జేరి యని ఖడ్గాఖడ్గిలీలల్ శరా
శరియుజ్జృంభణముల్ గదాగదివిలాసంబుల్ మదిన్ మెచ్చగన్. 111

శా. ఆలో నాదిననాథవంశమణి చక్రాంగోత్తమాస్థానిఁ బ్ర
త్యాలీఢస్థితిఁ బొల్చి కుండలితబాణాసోజ్జ్వలత్పాణియై
చాలన్ శింజినికానినాదమున నాశావీథి మేల్కాంచ ని
ర్వేలాస్త్రప్రకరంబు నించె నసుహృద్వీరాసుహృద్వృత్తిచేన్. 112

మ. పరబర్హ్యుద్ధతిఁ దూల్చి తార్క్ష్యహరణప్రౌఢిన్ విజృంభించి ని
ర్భరశక్తిన్ ధర గాఁడి పాఱె నలగోత్రాభృన్మహాజిహ్మగో
త్కరముల్ తద్విహృతిప్రకారభయరేఖావన్మహాజిహ్మగో
త్కరమున్ నిందయొనర్పఁ దత్పురము వేగం జేరు చందంబునన్. 113

చ. అమితనృపాలసాయకచయంబు నిశాటచమూతనుత్రఝా
టము వడిఁ దాఁకి పై కెగయుటల్ వినుతింపఁగ నయ్యె నౌర యు
త్తమనవకాముకచ్ఛట ముదంబున వచ్చె నటంచు నిర్జర
ప్రమదల కెల్లఁ జక్కఁ దెలుపం జనుపెంపు వహించి యయ్యెడన్. 114