పుట:Chandrika-Parinayamu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కనకకరవాలికాతారళీ ముకుళీకృత సభాజనలోచనాబ్జుండును, నతంద్ర సుచంద్రరాజచంద్ర ప్రతాపవీతిహోత్ర పరంపరాప్రకార సమున్నమ దంతరంగకరండాఖండరోషపార దౌల్బణీ విదార్యమాణ చీలబంధనశేముషీదాయక సాంపరాయిక లాలసాక్రమ సమేధమానాపఘన ఘనత్వ ఫలత్తనుత్రాణుండును, నలఘుబలాహితకాండాసమానవిలాస విక్షపణదీక్షాదక్ష వికటభ్రుకుటి కుండును, నఖిలప్రపంచ పంచతాకరణచణ విలయకాల మహాకాలసరూపరూపుండును, నగుచు నేఁడు గదా మదాశయపూర్తి గావించెఁ బంచజనమాంసంబని తలంచుచు, మణిమయాసనంబు డిగ్గన డిగనుఱికి, నిజావాసంబు వెడలి, వినీతసారథివరానీత శతాంగరాజం బెక్కి, క్రక్కిఱిసి రక్కసిదొరలు వెనువెంటం గొలువ, నభంగురమతంగజతురంగమ చక్రాంగపదాతిసముదయంబులతో నాహవోత్సాహంబున వెడలె నయ్యెడ. 105

మ. కరిఘీంకారము లాశరేశబలహుంకారంబు లర్వవ్రజ
స్థిరహేంకారము లక్షిచక్రవిలసత్క్రేంకారముల్ గూడి స
త్వరతం ద్విద్వయసాగరోర్మిచటులధ్వానంబు నాఁ జేర భూ
వరసేనాజన మాయితం బగుచు దైవాఱెన్ రణోత్సాహతన్. 106

మ. అరుణాభ్రోదితరక్తవృష్టి యనుకూలాన్యానిలశ్రేణి భా
స్వరకేత్వగ్రవిలగ్నగృధ్రము శివాజాతామితారావముల్
పరిదశ్యోల్క నిజాజయంబు వివరింపన్ వానిఁ జింతింప కా
సురవంశేశిత సంగరోర్వి నెనసెన్ శూరత్వ మొప్పారఁగన్. 107

ఉ. దానవనాయకాజ్ఞ సమదక్షణదాచరసైన్యకోటులున్
మానవనాయకాజ్ఞ నసమానమహాజనసైన్యకోటులున్
బూనినరోషచండిమ నపూర్వకలంబసమీకకేళి వై
మానికవార మభ్రమున మాటికిఁ గన్గొన సల్పె నేర్పునన్. 108