పుట:Chandrika-Parinayamu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. తానచాతురి కద్భుతముఁ దాల్చుపోలిక
వరమణిపుత్రికల్ శిరము లూఁప,
ఘనగానసుధఁ గ్రోలి తనివొంది బయ లూన్చు
గతి శిలాతతి జలౌఘమ్ముఁ గురియ,
యతిలయశ్రుతులవిస్తృతితత్త్వ మూనిన,
చాయ నాళులు వినిశ్చలతఁ దాల్ప,
బలురక్తి లోనిండి పట్టఁజాలక వెలు
వడుదారి వల్లికల్ కడుఁ జిగుర్ప,

తే. హారివసుపీఠికాసీనయై విపంచిఁ
గలసి గానము సేయు భూకాంతపుత్త్రిఁ
గనకనిభగాత్రిఁ గాంచి యయ్యినకులుండు
చాల నాశ్చర్యజలరాశిఁ దేలె నపుడు. 44

చ. తెఱలక కన్యఁజేరి తదధీనతఁ బొల్చి యినావలోక మ
త్తఱి నలర న్మిళద్ధరిరథంబయి మున్నె మనోభ్ర మెంతయున్
మెఱయఁగ నంతకన్న మును మించె శ్రమోదకవృష్టి చిత్రతన్
దొఱయఁగ మున్నె క్షేత్రమునఁ దోరముగాఁ బులకాఖ్యసస్యముల్. 45

చ. తరుణిమెఱుంగుటారుగడ దారున నెక్కి నృపాలుచూపుదొ
మ్మరి రమణీయహారగుణమండలిసందునఁ దారుచుం బయో
ధరసృతి లాగు వైచి వడిఁ దార్కొని సమ్ముఖరాజుఁ జేరఁ బం
కరుహశరుండు శార్యభిధకాహళి మ్రోయఁగఁ జేసె నత్తఱిన్. 46

చ. అవనిపకన్యనాభిజలజాకరసన్నిధి రోమవల్లికా
నవతరయష్టికాపదమునం బ్రియయోగము వూని శ్రీసతీ
భవమహిమాప్తి సిద్ధరసపాళికఁ బొందియుఁ బొంద వయ్యెఁ ద
త్ప్రవిమలకంధరాధ్వచరతన్ నృపునేత్రము లద్భుతస్థితిన్. 47