పుట:Chandrika-Parinayamu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూజాతాత్పర్యంబున నున్న సద్గుణోత్తములకు విరు లొసంగు నంతరంగంబునఁ బ్రమదావనంబు సొచ్చి ప్రమథమధురోష్ఠీతల్లజంబులు గేల నూది నిక్కి విటపాంతరాభివేష్టిత మల్లికాప్రసూనంబులఁ గోయునెడఁ దత్కరసంయోగంబువలన నిజేష్టఫలలాభంబు చేకూరెనో యన రమ్యఫలంబులం బెంపొందు మాకందంబులవలన మాకందవాసనాభివాసితపవమాన ప్లవమాననీలాశోకరజస్తోమంబు ప్రవర్గ్యోపక్రమనిర్గచ్ఛద్ధూమవర్తనంబునం బర్వ నమందానందకందళితచిత్తారవిందంబులతో ముందుముందుగఁ బఱతెంచు పురందరాది బృందారకవర్గంబుల తనూశ్రమంబుఁ దెరలం జేయు శీతలతర తాపసాశ్రమ నానావిధ వసుధారుహ నివహంబుల చెంతలం దదీయ శాఖాప్రసవముఖ వినిష్ఠ్యూత మధుపాళికం బ్రసవితంబులగు విశారద విటపి పటలంబులవలనను, వలను మిగిలి మేరుకుధరంబునుంబోలె శక్రపురాతిభాసురంబును, హిమవన్నగంబునుంబోలె గోభృత్కార్ముకాన్వితకాళికాతిశోభితంబును, మందరధరంబునుంబోలె వ్యాళాధిరాజపరివేష్టితంబును, ఋశ్యమూకాద్రియుంబోలె హరిజాతికలితంబును, మాల్యవద్గోత్రంబునుంబోలె రామసంచారసంగతంబును, నీలాచలంబునుంబోలె పురుషోత్తమభూషితంబును, గంధమాదనగ్రావంబునుంబోలె మహావరాహపాళికాలింగితంబును, సమామోదసంకలితశ్యామామహితం బయ్యును నసమామోదసంకలితశ్యామామహితంబై, వీనఘనార్భటివిఘూర్ణితమహాబిలం బయ్యును నవీనఘనార్భటివిఘూర్ణితమహాబిలంబై, మరాళికాశ్రితకటకస్థలవనజాతం బయ్యును నమరాళికాశ్రితకటకస్థలవనజాతంబై, సదృక్షరాజసారంగసంతానసంకలితం బయ్యును నసదృక్షరాజసారంగసంతానసంకలితంబై, కాలాహితసుమనోనగభాసమానం బయ్యును నకాలాహితసుమనోనగభాసమానంబై యొప్పుచున్నయది విలోకింపుము. 18

చ. అని లలితోక్తి నాప్రియవయస్యశిఖామణి చిత్తసీమఁ బా
యనిలలితోఁ దదద్రిమహిమాతిశయం బెఱిఁగింప, నప్పు డా
మనుకులరాజమౌళి బిలమండలి చొక్కపుఁదీవెయింటిమేల్
మను కులరాజకాంతతటమార్గములం గనుఁగొంచు నేఁగుచున్. 19