పుట:Chandrika-Parinayamu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వరవైజయంతికాపరిషక్తి నొప్పుటఁ
జక్రి దా నగుటకు సందియంబె,
సుకరయుగాదికాంగకలబ్ధిఁ దనరుట
సద్రథం బగుటకు సందియంబె,

తే. హరిభయంకరభూరిధామాప్తి మనుట
జగతి నిది తార్క్ష్యమగుటకు సందియంబె
యనఁగఁ బొగడొందు రత్నశతాంగ మప్పు
డధిపుకనుసన్నఁదెచ్చె నియంత యొకఁడు. 152

చ. తొడవులు మేటిమేనిజిగితో నిగుడం, గుడివంకఁ గెంపురా
పిడియము దోఁప, బంధునృపబృందము లందఱు నివ్వటిల్ల వెం
బడి నెడ యీక రాఁ, దళుకుబంగరుఁజేల యొకింత జీరఁగా,
వెడలె హజార మానృపతి విప్రయుగంబును దృష్టి నాఁగుచున్. 153

చ. కొలు విపు డబ్బె నంచు బలుకోర్కి మహీశులు నిల్చి కొల్వుమ్రొ
క్కులు ఘటియించి రప్పతి కకుంఠకలధ్వనివేత్రు లంగరా
ట్కులుఁడు పరా కితం డతఁడు కోసలనేత పరా కితండు కే
రలుఁడు పరా కతండు కురురాజు పరా కని యుగ్గడింపఁగన్. 154

మ. నృపరత్నంబు వినీతసూతతిలకానీతప్రియస్యందనం
బపు డిం పెచ్చఁగ నెక్కి యొప్పె మఘవాశాద్రిం గనం బొల్చు పూ
ర్ణపయోజారి యనన్, బుధావళి నవానందంబుచేఁ జూడ, న
భ్రపదం బాఁగుచు వాహినీశ్వరమహాభంగార్భటుల్ హెచ్చఁగన్. 155

వ. ఇట్టు లాలోకమిత్రుం డహీన భూరి ప్రగ్రహ ప్రకాండ పరిస్యూతంబును, నఖిల సన్మణి ప్రకర వర్ణనీయ ప్రభా భాసమా నైక చక్ర సముపేతంబును, నాశుగ మార్గాతి క్రమణ చణ వేగవ దసమావదాత తురంగ సంయోజితంబును, నమర వినుతాభిరామ ధామారుణ సారథి విభ్రాజితంబును