పుట:Chandragupta-Chakravarti.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ప్రకరణము

93


సైన్యంబులు దాడి వెడలు విధము

గడ్డియు నీళ్లును కట్టియలును సమృద్ధిగ దొరకు మార్గమని ముందు వెడలిన నాయకునిచే సూచింపఁబడిన వార్తననుసరించి ఆయా గ్రామముల నెఱింగికొని రాజు యుద్ధమునకు వెడలును.

సేనాముఖంబున నాయకులును, నడుమ రాజును అంతఃపుర స్త్రీలును, కుడియెడమవైపుల నాశ్విక సైన్యమును, చుట్టును నేనుంగులును దక్కుంగల సైన్యమును నడుచును. త్వరగా నడచిన యెడల దినమునకు రెండు యోజనములును (రమారమి 13 మైళ్ళు) మందముగా నడచిన నొక్క యోజనంబును (రమారమి 6 మైళ్లు) ప్రయాణము సాగించుచుండిరి. సేన విడిసి యున్నప్పుడు సేనాధ్యక్షుని కుటీరము సేనకు ముందుండును, సైన్యములు నెడలునప్పు డతఁడు వెనుక నడచును.

యుద్ధముచేయు సమయముల భటు లుత్సాహముతో బనిచేయఁగలందులకు గాను శత్రుసైన్యములలోని బంటును చంపినవానికి 20 పణములును, కాల్బలముల నాయకుని జంపిన వానికి 100 పణములును, ఆశ్వికుని జంపినవానికి 1,000 పణములును, ఏనుంగునుగాని రథంబునుగాని నాశనమొనర్చిన వానికి 5,000 పణంబులును శూరాగ్రేసరుల నాయకుని జంపిన వానికి 10,000 పణంబులును, యువరాజును గాని నేనాధ్యక్షునిగాని జంపినవానికి 50,000 పణంబులును, శత్రురాజును మడియించిన వానికి లక్ష పణంబులును బహుమాన మొసంగఁబడు చుండెను,